Punjab: పంజాబ్ ప్రభుత్వంపై షూటర్ అర్జున్ సంచలన వ్యాఖ్యలు
- కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ మద్దతు కరవైందన్న అర్జున్
- వివిధ రాష్ట్రాలు తమ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని వెల్లడి
- తనకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆవేదన
ప్యారిస్ ఒలింపిక్స్‌లో కొద్దిలో కాంస్యం కోల్పోయిన భారత షూటర్ అర్జున్ బబుతా సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి మద్దతు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ మద్దతు కరవైందన్నారు. తనకు పంజాబ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం దక్కలేదన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ ఈవెంట్‌లో ఈ స్టార్ షూటర్ నాలుగో స్థానంలో నిలిచాడు. కాంస్య పతక విజేత సరబ్ జోత్ సింగ్, మరికొందరు షూటర్లతో కలిసి ప్యారిస్ నుంచి అర్జున్ భారత్‌కు తిరిగి వచ్చాడు.
ఈ సందర్భంగా అర్జున్ బబుతా మాట్లాడుతూ... తాను సాధించిన విజయాలకు గాను ప్రభుత్వం నుంచి తనకు సహకారం ఉండాల్సిందన్నాడు. 2022లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, నాటి రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ తనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అండగా నిలబడతామని హామీ ఇచ్చారని తెలిపాడు.
దీనికి సంబంధించి తాను లేఖ రాశానని... అయితే వేచి ఉండాలని తనకు సమాధానం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తనను చాలా నిరాశకు గురి చేసిందన్నాడు. ఎవరికైనా ఉద్యోగ భద్రత ముఖ్యమని కాబట్టి వారు దీనిని పరిశీలించాలని కోరుకుంటున్నానన్నాడు. క్రీడల్లో తాను సాధించిన విజయాల ప్రకారం తనకు నిర్దిష్ట ర్యాంక్ రావాలన్నాడు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ తాను ఇదే డిమాండ్ చేశానన్నాడు.
ప్రభుత్వాలు మారుతున్నాయి... తన డిమాండ్ మాత్రం అలాగే ఉండిపోతోందని మండిపడ్డాడు. పరిస్థితి చూస్తుంటే తన ఆశలు మెల్లిగా సన్నగిల్లుతున్నాయన్నాడు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారని గుర్తు చేశాడు. కానీ పంజాబ్ షూటర్ల కోసం మాత్రం ఇక్కడి సీఎం, క్రీడాశాఖ మంత్రి మాత్రం ఏమీ చేయడం లేదన్నాడు. కనీసం విమానాశ్రయంలో తమకు స్వాగతం కూడా పలకలేదన్నాడు. పంజాబ్‌లో క్రీడల పట్ల ఆసక్తి క్షీణిస్తుందని ఎవరైనా అంటే అందులో రాష్ట్ర మంత్రుల పాత్ర ఉందని ఆరోపించాడు.