Wayanad landslides: వయనాడ్ బాధితులకు న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల భారీ విరాళం!

Nayanthara and Vignesh Shivan donate Rs 20 lakh to Wayanad landslide victims

  • కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 20 ల‌క్ష‌ల విరాళం 
  • విషాద ఘ‌ట‌న‌ తమ హృదయాలను క‌లిచివేసిందన్న జంట   
  • పునర్నిర్మాణానికి  మద్దతు తెలియజేస్తూ లేఖ విడుదల   

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. జులై 26న వాయనాడ్‌లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మృతిచెందారు. వందలాది మంది గాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటీనటులు ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. 

గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. సూర్య, జ్యోతిక, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న సహా పలువురు ప్రముఖులు రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భ‌ర్త‌, కోలీవుడ్ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివన్ తమ వంతు సాయంగా రూ.20లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ఈ సంద‌ర్భంగా ఈ జంట వారి ఇద్దరు కుమారులతో పాటు వయనాడ్‌లోని ప్రజల జీవితాలను పునర్నిర్మించడానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. 

"వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విషాద‌క‌ర ఘ‌ట‌న‌ మా హృదయాలను క‌లిచివేసింది. సమాజం అనుభవించిన విధ్వంసం, నష్టాలు దయనీయంగా ఉన్నాయి. సంఘీభావంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కోసం మేము ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 20లక్షలు అందిస్తున్నాము" అని లేఖ‌లో పేర్కొన్నారు. 

కాగా, నయనతార స్వస్థలం కేరళ. ఆమె తల్లిదండ్రులు ఓమన కురియన్, కురియన్ కొడియాట్టు కేరళలోని తిరువల్లలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు డయానా మరియం కురియన్‌గా ఆమె జన్మించారు.

ఇక విఘ్నేష్ శివన్, నయనతార దంప‌తులకు ఉలగ్, ఉయిర్ అనే కవల పిల్ల‌లు ఉన్నారు. ప్ర‌స్తుతం న‌య‌నతార న‌టించిన‌ రెండు తమిళ చిత్రాలు 'ది టెస్ట్స‌, 'మన్నంగట్టి సిన్స్ 1960' విడుద‌ల కావాల్సి ఉన్నాయి. అలాగే విఘ్నేష్ శివన్ ప్రస్తుతం తన దర్శకత్వంలో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.
.

  • Loading...

More Telugu News