Manu Bhaker: త్రుటిలో మూడో పతకం చేజార్చుకున్న మనుభాకర్
- 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన మనుభాకర్
- రెండు పతకాలతో భారత్ తిరిగిరానున్న షూటర్
- ఒలింపిక్స్ నేపథ్యంలో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు వెల్లడి
ప్యారిస్ ఒలింపిక్స్‌లో మనుబాకర్ త్రుటిలో మూడో పతకాన్ని చేజార్చుకుంది. 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఆమె మహిళల విభాగంలో ఒక కాంస్యాన్ని, మిక్స్డ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకుంది. రెండు పతకాలతో ఆమె భారత్ తిరిగిరానుంది.
ఫైనల్‌లో స్టేజ్ వన్‌ను మనుభాకర్ కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. ఇక్కడ సిరీస్ 1లో కేవలం 2 షాట్లను మాత్రమే కొట్టింది. ఆ తర్వాత మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది. సిరీస్ 2లో నాలుగు, సిరీస్ 3లో నాలుగు షాట్లు కొట్టి పైకి ఎగబాకింది. సిరస్ 6 వరకు అత్యుత్తమంగా షూట్ చేసిన మనుభాకర్ ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది.
ప్రత్యర్థి షూటర్లు కూడా మంచి ప్రదర్శన కనబరచడంతో పోటీని ఎదుర్కొంది. ఎలిమినేషన్ చివరి సిరీస్ 8లో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టడంతో మనుభాకర్ రేసులో వెనుకబడిపోయింది. హంగేరీ అథ్లెట్ కామెలీ 3 షాట్లతో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో మనుభాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఫైనల్‌లో తాను భయాందోళనలకు గురయ్యానని మనుభాకర్ వెల్లడించింది. పతకం కోసం తన వంతు ప్రయత్నం చేశానని పేర్కొంది. అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా కనిపించలేదన్నారు. ఒలింపిక్స్ నేపథ్యంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది. తాను రెండు పతకాలు గెలవడానికి ఇది దోహదపడిందని పేర్కొంది. అయితే ఈ రోజు తనకు దురదృష్టకరమైన రోజు అని వాపోయింది.