MVV Satyanarayana: నా కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మరోసారి విచారణ జరపాలి: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

Visakha ex MP MVV Satyanarayana reacts on media stories
  • గతంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్
  • ప్రధాన నిందితుడిగా ఉన్న హేమంత్
  • మాజీ ఎంపీ ఎంవీవీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందంటూ నేడు పత్రికల్లో కథనాలు
గతంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులను వారి సొంత ఇంట్లోనే కిడ్నాపర్లు బంధించడం తెలిసిందే. ఎంపీ కుమారుడ్ని, కుటుంబ ఆడిటర్ ను హింసించిన దుండగులు కోటి రూపాయలకు పైగా రాబట్టుకున్నారు. హేమంత్ అనే రౌడీషీటర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హేమంత్ తో మాజీ ఎంపీ ఎంవీవీకి లావాదేవీలు ఉన్నాయని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. 

అయితే ఇవాళ పలు దినపత్రికల్లో కథనాలు ప్రచురించారు. మాజీ ఎంపీ ఎంవీవీ బంధువు ఒకరు హేమంత్ కు ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం వెనుకున్న కథ ఏంటి? దానిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది అని ఓ కథనంలో పేర్కొన్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండగా, ఈ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు పూర్తి వివరాలు బయటపెట్టలేదని కూడా ఆ కథనంలో వివరించారు. 

తనపై ఇవాళ వచ్చిన కథనం పట్ల వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటనపై మరోసారి విచారణ జరపాలని కోరుతున్నానని డిమాండ్ చేశారు. హేమంత్ సంతకం లేని ఒక ఉత్తరాన్ని బయటికి తీసుకువచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. హేమంత్ కు ఖరీదైన వాహనాలు, విల్లాలను తాను కానుకగా ఇస్తే, అవి ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. 

హేమంత్ తో తనకు లావాదేవీలు ఉన్నాయని, తాను అతడితో సెటిల్మెంట్లు చేయించానని ఇష్టం వచ్చినట్టు రాశారని వెల్లడించారు. మా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కక్షగట్టి డబ్బుల కోసం నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశాడని ప్రచారం చేశారని తెలిపారు. 

"వాస్తవాలేంటో మాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజున కిడ్నాప్ ఘటనతో బాధపడింది మేమే. ఆ బాధ ఏంటో మా భార్యకు తెలుసు, మా కుమారుడికి తెలుసు, మా స్నేహితుడు జీవీ (ఆడిటర్) గారికి తెలుసు. దాదాపు వాళ్లు కిడ్నాపర్ల చేతిలో చచ్చి బతికి వచ్చారు. సరే... అయిందేదో అయిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా విచారణ చేసి దీని వెనుక కారణాలేంటో బయటికి తీయాలని మళ్లీ మొదలుపెట్టారు. చాలా మంచిది... దీనిపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయండి. 

ఆ రోజున సీఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సీపీలు అందరూ ఎంక్వైరీ చేశారు. జరిగిన ఘటనలపై ఆధారాలతో రిపోర్టు తయారుచేసి కోర్టుకు అందించారు. ఇప్పుడు కూడా మేం దర్యాప్తు చేయమనే చెబుతున్నాం. ఆ ఘటన వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలంటున్నాం. 

ఇక మరీ దారుణంగా హేమంత్ కు నాకు సంబంధాలు చెడడం వల్లే ఈ కిడ్నాప్ జరిగిందని రాశారు. 12 ఇళ్ల స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు నేను ఇచ్చానని... మా కోడలు తండ్రి సత్యనారాయణ బెంగళూరులో ఉంటారు.... ఇక్కడ సంగతులతో వారికేమీ సంబంధం లేదు... కానీ ఆయనను కూడా ఇందులో ఇరికించారు. ఆయన హేమంత్ కు ఎందుకు గిఫ్ట్ లు ఇవ్వాల్సి వచ్చింది? అని రాశారు" అంటూ ఎంవీవీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
MVV Satyanarayana
Kidnap
Hemanth
Visakhapatnam
YSRCP

More Telugu News