Amrapali: జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు వార్నింగ్ ఇచ్చిన ఆమ్రపాలి!
- గ్రేటర్ హైదరాబాద్ పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన ఆమ్రపాలి
- జోనల్ కమిషనర్లతో ఆమ్రపాలి టెలీకాన్ఫరెన్స్
- నలుగురు డిప్యూటీ కమిషర్లకు షోకాజ్ నోటీసులు!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలి విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నందున గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన ఆమ్రపాలి... కొందరు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె నలుగురు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. పారిశుద్ధ్యంపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బాధ్యులైన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆమ్రపాలి స్పష్టం చేశారు.
నగర పారిశుద్ధ్యం అంశంపై ఆమె నేడు జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిర్ణీత సమయానికే విధులకు హాజరయ్యేలా చూడాలని, చెత్త కుండీ పాయింట్ల ఎలిమినేషన్ పై తగిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చెరువుల చుట్టూ కంచెలు వేయాలని, ఇప్పటికే ఉన్న కంచెలు ఎంత దృఢంగా ఉన్నాయన్న అంశాన్ని పరిశీలించాలని సూచించారు.