Padi Kaushik Reddy: హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నా... ఎక్కడకు రమ్మంటావో చెప్పు: దానంకు కౌశిక్ రెడ్డి సవాల్

Padi Koushik Reddy challenges Danam Nagendar
  • దానం నాగేందర్‌కు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కౌశిక్ రెడ్డి
  • బీఆర్ఎస్ శాసన సభ్యులను దానం ఇష్టం వచ్చినట్లు దూషించారని విమర్శ
  • జాబ్ క్యాలెండర్‌లో ఎలాంటి వివరాలూ లేవన్న కౌశిక్ రెడ్డి
హైదరాబాద్ నడిబొడ్డున తిరుగుతున్నాను... ఎక్కడకు రమ్మంటావో చెప్పు అంటూ మాజీ మంత్రి దానం నాగేందర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డిలను ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా? అని ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు ప్రస్తుత ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. ఆయనకు సిగ్గుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ మాత్రమే అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శుక్రవారం ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగ ఖాళీలతో జాబ్ వివరాలు లేవన్నారు. జాబ్ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదన్నారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులపై ఇష్టమొచ్చినట్లుగా అసభ్యపదజాలంతో దూషించారని దానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానం నాగేందర్‌కు సీఎం మైక్ ఇప్పించి తమను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ఆయన సంస్కారం లేకుండా మాట్లాడారన్నారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే దానం నీచమైన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దానం చేసిన విమర్శలన్నీ నిరుద్యోగులను ఉద్దేశించి చేసినవే అన్నారు. ఆయన బెదిరింపులకు భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు.
Padi Kaushik Reddy
Danam Nagender
BRS
Congress

More Telugu News