Brahmotsavams: అక్టోబరు మొదటి వారంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Srivari Brahmotsavams will begin from Oct 4

  • అక్టోబరు 4న ధ్వజారోహణం
  • అక్టోబరు 12న చక్రస్నానం
  • ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ఖరారు చేసింది. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని టీటీడీ వెల్లడించింది. 

అక్టోబరు 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న గరుడ సేవ అక్టోబరు 8న నిర్వహించనున్నారు. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్న ఉద్దేశంతో అక్టోబరు 7వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుంది. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కొండపై అత్యంత రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, ఎన్నారై, ఆర్జిత సేవల కోటా దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. 

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నేడు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయమే ఉందని, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News