Wayanad Landslide: వయనాడ్‌లో ఓ వైపు మానవతా సంక్షోభం.. మరోవైపు దొంగతనాలు
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి విలయం సృష్టించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య ఇప్పటికే 300 దాటిపోగా.. దాదాపు మరో 200 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా కొండచరియల విధ్వంసంతో గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను బాధితులు వదిలిపెట్టాల్సి వచ్చింది. బాధితులంతా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. అయితే కేరళ చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభం అయిన వయనాడ్ విలయ ప్రదేశంలో దొంగతనాలు జరుగుతున్నాయి. విడిచిపెట్టిన ఇళ్లలో దొంగలు పడుతున్నారు. ఈ విషయం తెలిసిన బాధితులు పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చాలా మంది బాధితులు తమ ఇళ్లలో దొంగతనాలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలంటూ కోరుతున్నారు. దీంతో విలయ ప్రాంతాలలో పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు గస్తీని ఏర్పాటు చేసినట్టు శనివారం సాయంత్రం పోలీసులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అనుమతి లేకుండా రాత్రి సమయాల్లో బాధిత ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ఎవరైనా ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, ఇతర కారణాలతో ఇళ్లలోకి ప్రవేశించడానికి వీలులేదని స్పష్టం చేశారు.
కొండచరియలు విరిగిపడడంతో భద్రత కోసం తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని, తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే తలుపులు పగలగొట్టి ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు.