Ishan Kishan: జాతీయ సెలెక్టర్ల సలహా తీసుకున్న ఇషాన్ కిషన్.. మైదానంలోకి దిగేందుకు రెడీ!
- దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన స్టార్ వికెట్ కీపర్
- శ్రేయోభిలాషులు, సెలెక్టర్ల సలహా మేరకు జార్ఖండ్ తరపున బరిలోకి
- 25 మందితో కూడిన జార్ఖండ్ ప్రీ-సీజన్ ప్రాబబుల్స్ ఆటగాళ్లలో ఇషాన్‌కు చోటు
వ్యక్తిగత కారణాలతో గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకుని.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండి బీసీసీఐ ఆగ్రహానికి గురైన యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. జార్ఖండ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడని, ఈ మేరకు జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన 25 మంది ప్రీ-సీజన్ ప్రాబబుల్స్ జాబితాలో అతడి పేరు ఉందని ‘క్రిక్‌బజ్ కథనం’ పేర్కొంది. కొంతమంది తన శ్రేయోభిలాషులు, జాతీయ సెలెక్టర్లను సంప్రదించిన తర్వాత ఇషాన్ కిషన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు కథనం పేర్కొంది.
దేశీయ సీజన్‌కు తాను అందుబాటులో ఉండబోతున్నట్టుగా జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించాడని, ఇషాన్‌ను కెప్టెన్‌గా పరిగణించే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషించింది. కాగా దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో 2023-24 సంవత్సరానికి సంబంధించి ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసింది. కాగా ఇషాన్ కిషన్ చివరిగా నవంబర్ 2023లో భారత్ తరఫున ఆడాడు.
కాగా క్రికెట్ కెరియర్ పరంగా ఇషాన్ కిషన్ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. జట్టులో జటు దక్కకపోవడమే కాకుండా అతడి సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి జాతీయ జట్టులోకి ప్రవేశించాలని భావిస్తున్నాడు. అందులో ఈ ఏడాది జరిగిన డీవై పాటిల్ టీ20 కప్-2024తో పాటు ఐపీఎల్ కూడా ఆడాడు.
కాగా టీ20 ఫార్మాట్‌లో ఇషాన్ కిషన్ ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడాడు. 25.7 సగటుతో 796 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 124.4గా ఉంది. ఇక వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే మొత్తం 27 మ్యాచ్‌లు ఆడాడు. 102.2 స్ట్రైక్ రేట్, 42.4 సగటుతో 933 పరుగులు సాధించారు. ఇక టెస్ట్ క్రికెట్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.