Imane Khelif: ఒలింపిక్స్‌లో వివాదాస్పద బాక్సర్ ఇమానే ఖేలిఫ్ ఆడా? మగా?.. తొలిసారి కన్నతండ్రి స్పందన

Imane Khelif said that My child is a girl and he Shows Evidence
  • వివాదాస్పద బాక్సర్ ఖేలిఫ్ తండ్రి తొలిసారి స్పందన
  • ఆమె ఒక స్త్రీ అంటూ ధృవీకరణ పత్రాలు చూపించిన తండ్రి ఒమర్
  • 'బయోలాజికల్ మేల్' అంటూ విమర్శలు వ్యక్తమవుతున్న వేళ స్పందన
  • ఖేలిఫ్ శరీరంలో ఎక్స్‌వై క్రోమోజోములు ఉండడమే వివాదానికి కారణం
అల్జీరియాకు చెందిన మహిళా బాక్సర్ ఇమానే ఖేలిఫ్ ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌-2024లో పతకం గెలుచుకోవడం ఖాయమైంది. అయితే బాక్సింగ్ రింగ్‌లో కంటే ఆమె ఆడా? మగా? అనే వివాదంతోనే ఆమె ఎక్కువగా పోరాడాల్సి వస్తోంది. ఆమె శరీరంలో ఎక్స్‌వై (XY) క్రోమోజోములు ఉండడంతో 'బయోలాజికల్ మేల్' అంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళపై పురుషుడిని ఎలా ఆడిస్తారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఖేలిఫ్ పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది. 

అయితే అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్‌తో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అంగీకరించలేదు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్న ఖేలిఫ్‌తో పాటు మరో బాక్సర్‌కు కూడా అనుమతించింది. దీంతో వివాదం ఎడతెగకుండా కొనసాగుతోంది. అయితే ఈ వివాదంపై ఖేలిఫ్ తండ్రి ఒమర్ తొలిసారి మౌనం వీడారు. ఇమానే ఖేలిఫ్ ఆడపిల్లగా పుట్టిందని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన  రుజువులను ఆయన చూపించారు. 2 మే 1999న ఖేలిఫ్ పుట్టినట్టుగా ఆయన ధ్రువీకరణ పత్రాలను చూపించారు. ఆమె స్త్రీ అని రుజువు చేసే పత్రాలను ప్రదర్శించారు. విమర్శకులు వదంతులను వ్యాపింపజేసి ఆమె ప్రదర్శనను అస్థిరపరచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారని, కానీ తన కూతురు పసడి పతకంతో ఇంటికి రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. 

‘‘నా బిడ్డ ఒక అమ్మాయి. ఆమె ఒక అమ్మాయిగానే పెరిగింది. ఆమె ధైర్యవంతురాలు. నేను ఆమెను కష్టపడి చాలా ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దాను. కష్టపడాలని, శిక్షణ పొందాలనే బలమైన సంకల్పం ఉన్న వ్యక్తి ఆమె’’ అని ఒమర్ అన్నారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా ఇమానే ఖేలిఫ్‌తో జరిగిన పోటీలో మ్యాచ్‌ మధ్యలోనే ఇటాలియన్ బాక్సర్‌ తప్పుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ బాక్సింగ్ రింగ్‌ను వీడింది. ఈ పరిణామంపై ఒమర్ స్పందిస్తూ.. తన కూతురు బౌట్‌లో మరింత బలంగా, మెరుగ్గా రాణించిందని సమర్థించారు. ఇటలీకి చెందిన బాక్సర్ తన కూతురిని ఓడించలేకపోయిందని వ్యాఖ్యానించారు. ‘‘నా కూతురు బలంగా ఉంటే.. ఆమె మృదువుగా ఉంది’’ అంటూ సమర్థించారు.

మరోవైపు తాను స్త్రీని అని ఖేలిఫ్ ఇదివరకే ప్రకటించారు. తాను ఒక మహిళగానే ఉంటానంటూ కన్నీళ్లతో ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఖేలిఫ్ క్వార్టర్-ఫైనల్ బౌట్‌లో గెలవడంతో కాంస్య పతకం గెలవడం ఖాయమైంది. తదుపరి మ్యాచ్‌లో ప్రదర్శన ఆధారంగా ఆమెకు ఏ పతకం వస్తుందనేది తెలియనుంది.
Imane Khelif
Paris Olympics
Paris Olympics Row

More Telugu News