American Airlines: మహిళ తలలో పేలు చూసిన ప్రయాణికులు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
- లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో ఘటన
- ఈ ఘటనతో 12 గంటలు ఆలస్యమైన విమానం
- జూన్ 15న జరిగిన ఈ ఘటన తాజాగా టిక్‌టాక్ వీడియోతో వెలుగులోకి
- నిజమేనని నిర్ధారించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్
సాధారణంగా ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైనా, ప్రయాణికుల్లో ఎవరికైనా అత్యవసర వైద్య సాయం అవసరమైనా, బాంబు బెదిరింపులు వచ్చినా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేస్తుంటారు. కానీ, ఇది మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ప్రయాణికురాలి తలలో పాకుతున్న పేలు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాయి. నమ్మడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్నా ఇది నిజం.
లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని చూసిన ప్రయాణికులు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో ఫినిక్స్‌లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎథాన్ జుడెల్సన్ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని ‘టిక్‌టాక్’లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
విమానాన్ని మళ్లిస్తున్నట్టు మాత్రమే విమాన సిబ్బంది చెప్పడంతో ప్రయాణికుల్లో అయోమయం నెలకొందని చెబుతూ ఏం జరిగిందో వివరించాడు. ‘‘నేను చుట్టూ చూశాను. ఎవరూ భయపడడం లేదు. అయినా విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఓ మహిళ విమానం ముందు వైపునకు దూసుకుపోయింది’’ అని పేర్కొన్నాడు.
ఆ తర్వాత విమానం ఎందుకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని తోటి ప్రయాణికుడిని అడిగితే అసలు విషయం తెలిసిందని, ఓ మహిళ తలలో పేలు పాకుతుండడాన్ని ఇద్దరు ప్రయాణికులు చూసి విమాన సిబ్బందికి చెప్పారని పేర్కొన్నారు. వారొచ్చి చూస్తే నిజంగానే ఆమె తలలో పేలు పాకుతున్నాయని వివరించాడు. ఆ తర్వాత విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన కారణంగా విమానం 12 గంటలు ఆలస్యమైందని, అప్పటి వరకు ప్రయాణికులకు హోటల్ లో గదులు ఇచ్చారని వివరించాడు.
ఈ విషయాన్ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది. జూన్ 15న ఈ ఘటన జరిగిందని, ప్రయాణికురాలికి వైద్యసాయం అవసరం కావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.