Chandrababu: టాప్-10లో ఒక్క ఏపీ యూనివర్సిటీ లేకపోవడం బాధాకరం: సీఎం చంద్రబాబు
- అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం
- నైపుణ్యాభివృద్ధి, విద్య తదితర అంశాలపై చర్చ
- గతంలో నాక్ అక్రెడిటేషన్ టాప్-10లో ఏపీ వర్సిటీలు ఉండేవన్న చంద్రబాబు
- ప్రస్తుతం రాష్ట్రంలో వర్సిటీల పరిస్థితి పట్ల విచారం
ఏపీ రాజధాని అమరావతిలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచస్థాయి ఉద్యోగాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాలు పెంచే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ సందర్భంగా ఏపీలోని యూనివర్సిటీల పరిస్థితి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గతంలో నాక్ అక్రెడిటేషన్ లో ఏపీ విశ్వవిద్యాలయాలు టాప్-10లో ఉండేవని, కానీ ఇప్పుడు ఏపీకి చెందిన ఒక్క వర్సిటీ కూడా టాప్-10లో లేకపోవడం బాధాకరమని అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలని చంద్రబాబు అభిలషించారు. అంతర్జాతీయస్థాయిలో నైపుణ్యాలు సాధించేలా శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు.
వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానం రూపొందించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్చువల్ వర్కింగ్ హబ్ గా అవతరించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు.