Stock Market: అమెరికా మాంద్యం భయాలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్... రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరి
భారత స్టాక్ మార్కెట్ కు ఇవాళ అత్యంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. అమెరికా ఆర్థికమాంద్యం భయాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే మదుపరులకు చెందిన రూ.16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
సెన్సెక్స్ ఏకంగా 2,222 పాయింట్లు నష్టపోయి 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్ల నష్టంతో 24,005 వద్ద స్థిరపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, రియల్ ఎస్టేట్, ఇంధనం, మౌలికవసతులు, ఆటోమొబైల్, ఐటీ పరిశ్రమల షేర్లు తీవ్ర కుదుపులకు గురయ్యాయి.
టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, మారుతి సుజుకి, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. హెచ్ యూఎల్, నెస్లే ఇండియా షేర్లు మాత్రం నష్టాల నుంచి తప్పించుకున్నాయి.