Paris Olympics 2024: భ‌ళా మ‌హిళ‌లు... టేబుల్ టెన్నిస్‌లో సరికొత్త చ‌రిత్ర‌... క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భార‌త జ‌ట్టు!

Indian women table tennis team into the Quarter Finals in Paris Olympics 2024
  • ప్రిక్వార్టర్స్ లో 3-2 తేడాతో రొమేనియాపై విజ‌యం
  • మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్ లతో కూడిన భారత జ‌ట్టు రికార్డ్‌
  • ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో క్వార్టర్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా చ‌రిత్ర‌
పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత జ‌ట్టు క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్ లో 3-2 తేడాతో రొమేనియాపై విజ‌యం సాధించింది. దీంతో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్ లతో కూడిన భారత త్రయం ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా చ‌రిత్ర‌కెక్కింది.

ముందుగా డబుల్స్ లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌ జోడీ అద్భుతంగా ఆడి మూడు గేమ్‌ల్లోనూ ఆధిక్యంలో నిలిచింది. 11-9, 12-10, 11-7తో డయాకోను, సమర ఎలిజబెటాను మ‌ట్టిక‌రిపించ‌డంతో భారత్‌ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత సింగిల్స్‌ మొదటి మ్యాచులో మనికా బాత్రా చెలరేగిపోయింది. 11-5, 11-7, 11-7తో బెర్నాడెట్టేను ఓడించింది

కానీ, ఆ తర్వాత వెంట‌నే పుంజుకున్న రొమేనియా వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గి 2-2తో స్కోరును సమం చేసింది. అదే స‌మ‌యంలో హోరాహోరీగా సాగిన సింగిల్స్‌ రెండో మ్యాచులో శ్రీజ 11-8, 4-11, 11-7, 6-11, 8-11 ఎలిజబెటా చేతిలో పోరాడి ఓడింది. 

అలాగే మూడో మ్యాచులో అర్చనా కామత్‌ 5-11, 11-8, 7-11, 9-11 బెర్నాడెట్టే చేతిలో ప‌రాజ‌యం పొందింది. ఇక ఫలితాన్ని తేల్చే ఐదో మ్యాచులో డయాకోనుపై తొలి గేమ్‌లో మనికా బాత్రా 11-5తో సునాయాసంగా గెలుపొందింది. రెండో గేమ్‌లోనూ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా 11-9తో విజ‌యం సాధించారు. 

కీలకమైన మూడో గేమ్‌లో మనికా 0-2తో వెనుకబడినా పుంజుకుని 8-5తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత ప్రత్యర్థి జోరు పెంచడం వల్ల విజయంపై ఉత్కంఠ నెలకొంది. చివరకు మనికా 11-9తో మూడో గేమ్‌లోనూ గెల‌వ‌డంతో భారత టీమ్‌ క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో అమెరికా లేదా జ‌ర్మ‌నీతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది.
Paris Olympics 2024
Table Tennis
Indian women
Quarter Finals
Sports News

More Telugu News