Chandrababu: కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

Chandrababu comments in collectors meeting
  • గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ప్రత్యర్ధులను వేధించడానికే వాడుకుందని చంద్రబాబు విమర్శ
  • నేరాల నియంత్రణలో చాలావాటికి సీసీ కెమెరాలను ఉపయోగించుకోవచ్చన్న చంద్రబాబు
  • అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి సిద్దంగా లేనని వ్యాఖ్యానించిన చంద్రబాబు
నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతల అంశంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేతల నియంత్రణకు సీసీ కెమెరాలను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేకపోయిందన్నచంద్రబాబు... ప్రత్యర్ధులను వేధించడానికే పోలీస్ వ్యవస్థను వాడుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలను దేనికి వినియోగిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించగా, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జంపింగ్ చేసే వాళ్లను గుర్తించడానికి వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు.

సీసీ కెమెరాలను సిగ్నల్ వద్ద జంపింగ్ చేసే వారినే కాదు, చాలా వాటికి వినియోగించుకోవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు. సీసీ కెమెరాలను ఇంటిగ్రేట్ చేయాలని చెప్పారు. ఎవరైనా నేరాలకు పాల్పడి పారిపోయే ప్రయత్నం చేస్తే వారిని గుర్తించే పరిస్థితి రావాలని అన్నారు. రౌడీ షీటర్లపై నిఘాకు సీసీ కెమెరాలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లోనూ సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించారు.
 
చాలా మంది గంజాయి తాగి నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం చర్యల వల్ల నేరగాళ్ల ఇష్టారాజ్యం అన్నట్లుగా పరిస్థితి మారిందంటూ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ.. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడాన్ని తాను ఇష్టపడనని చంద్రబాబు అన్నారు.
Chandrababu
Comments
Collectors Meeting

More Telugu News