Thummala: సాంకేతిక కారణాల వల్లే అలా జరిగింది... రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల నాగేశ్వరరావు
- కొన్ని సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్న మంత్రి
- ఈ పొరపాట్లు సరిచేసి అర్హులనీ రుణవిముక్తి చేస్తామని హామీ
- రుణమాఫీ సరిగ్గా చేయని బీఆర్ఎస్ ఇప్పుడు తమపై విమర్శలు చేయడమేమిటని నిలదీత
రుణమాఫీ కాకపోయినప్పటికీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ సరిగ్గా జరగలేదనే భావన రైతుల్లో ఉందన్నారు. ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మి రుణమాఫీ చేయాలని గత ప్రభుత్వం ఆలోచించిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో సరైన పద్ధతిలో రుణమాఫీ జరగలేదని... ఇప్పుడు మాత్రం తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ అంశంలో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రతిపక్ష నేతలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత ఐదేళ్లలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నామన్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పాస్ బుక్ లేకపోయినా... తెల్లకార్డు ద్వారా రుణమాఫీ చేస్తున్నామన్నారు. రుణాలు మాఫీ కాకపోయినా ఎవరికీ ఆందోళన వద్దన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 30 వేల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. ఈ పొరపాట్లు సరిచేసి అర్హులందరినీ రుణవిముక్తుల్ని చేస్తామన్నారు. ఆగస్ట్ 15న రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి వైరాలో ప్రారంభిస్తారన్నారు.