Lavu Sri Krishna Devarayalu: ఏపీ ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని పార్లమెంటులో ఎంపీలందరికీ ఇస్తాం: లావు శ్రీకృష్ణదేవరాయలు

Lavu Sri Krishnadevarayalu explaisn AP economic situation in Lok Sabha

  • ఆర్థిక బిల్లుపై లోక్ సభలో చర్చ
  • ఏపీ ఆర్థిక పరిస్థితిని లోక్ సభ ముందుంచిన టీడీపీ ఎంపీ లావు
  • ఐదేళ్లలో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వెల్లడి
  • ఏపీకి కేంద్రం చేయూతనివ్వాలని విజ్ఞప్తి

ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రస్తావించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన ఏపీ ఆర్థిక శాఖ శ్వేతపత్రాన్ని పార్లమెంటులో ఎంపీలందరికీ ఇస్తామని వెల్లడించారు. ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితిని ఆయన లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. 

"ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆర్థిక శాఖపై శ్వేతపత్రం తీసుకువచ్చింది. దాని ప్రతులను పార్లమెంటు  సభ్యులందరికీ అందిస్తాం. ఏపీ వ్యయం రూ.1.64 లక్షల కోట్లు కాగా... ఆదాయం రూ.145 లక్షల కోట్లు. ఈ ఏడాది రూ.19 వేల కోట్ల లోటు స్పష్టంగా ఉంది. రాష్ట్ర అప్పు 2019లో రూ.3.75 లక్షల కోట్లు ఉంటే... అది 2024 నాటికి 9.74 లక్షల కోట్లకు పెరిగింది. 

గడచిన ఐదేళ్లలో వృద్ధి రేటు గణనీయంగా తగ్గిపోయింది. ఏపీలో వృద్ధి రేటు 13.5 శాతం నుంచి 10.5 శాతానికి పడిపోయింది. అదే సమయంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు 16 నుంచి 10 శాతానికి దిగజారింది. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని చెప్పడానికి దిగజారిన వృద్ధి రేటే నిదర్శనం. మరోవైపు, రాష్ట్ర ద్రవ్యోల్బణం 4.5 శాతం నుంచి 6 శాతాన్ని మించిపోయింది. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. రెవెన్యూ లోటు, అప్పుల భారం నుంచి బయటపడేందుకు ఏపీకి చేయూతనివ్వాలి. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విషయంలో కేంద్ర పునరాలోచన చేయాలి. ఆరోగ్య, బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించాలి. జౌళి రంగాన్ని ఆదుకునేందుకు పత్తి దిగుమతులపై సుంకాలు తగ్గించాలి. గతంలో చెల్లించాల్సిన పన్నుల విధానాన్ని ఎత్తివేయాలి" అని లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 

ఇతర సభ్యులు చెప్పినట్టు, ఏపీకి కేంద్రం ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేశారు. పూర్వోదయ పథకానికి రూ.62 వేల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తీర ప్రాంతంలో పెద్ద రాష్ట్రం గనుక ఏపీకి ఎక్కువ నిధులు రావాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News