Damodara Raja Narasimha: ఎంబీబీఎస్ ప్రవేశాల అంశంపై స్పందించిన దామోదర రాజనర్సింహ
- ఇటీవల విడుదలైన జీవో 33పై బీఆర్ఎస్ నేతల విమర్శలు
- జీవో నెం.114లోని 9-12 వరకు చదివిన వారిని స్థానికులుగానే పరిగణిస్తామని వెల్లడి
- ఒకేచోట నాలుగేళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని వెల్లడి
తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల అంశంలో జీవో నెం.33 వర్తింపుపై మంత్రి దామోదర రాజనర్సింహ నేడు స్పష్టతను ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన జీవో 33పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎంబీబీఎస్‌లో ప్రవేశాల జీవోపై స్పందించారు.
9వ తరగతి నుంచి 12 వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ గతంలోనే జీవో (నెం.114) జారీ చేసినట్లు గుర్తు చేశారు. 2017 జులై 5న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ జీవో జారీ చేసిందన్నారు.
ఈ జీవో నెం.114లోని 9వ తరగతి నుంచి 12 వరకు చదివిన వారిని స్థానికులుగానే పరిగణించే విధానాన్ని తాము కూడా అమలు చేస్తున్నామని, ఈ జీవోలోని నిబంధననే జీవో నెం.33లోనూ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట నాలుగేళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని స్పష్టం చేశారు.