Jagan: అప్పుడు మా వాళ్లు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండదు: జగన్
- నవాబ్ పేటలో వైసీపీ కార్యకర్తలపై దాడి జరిగిందన్న జగన్
- విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలకు పరామర్శ
- దాడులు ఆపాలంటూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక
ఎన్టీఆర్ నవాబ్ పేటలో తమ కార్యకర్తలపై దాడి జరిగిందంటూ వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. ఆయన ఇవాళ విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరామర్శించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ హెచ్చరిస్తున్నా... దాడులు ఆపండి... అని స్పష్టం చేశారు. నవాబ్ పేటలో వైసీపీ కార్యకర్తలపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని, సుమారు 20 మంది వచ్చి దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఇలాంటి దాడులతో చంద్రబాబు సాధించేది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాను... ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కంట్రోల్ తప్పాయి అని వివరించారు.
"గ్రామస్థాయి నుంచే బీభత్సం సృష్టిస్తున్నారు. నంద్యాలలోనూ రాజకీయ హత్య జరిగింది... శుక్రవారం అక్కడికి వెళుతున్నా... ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు... రేపు మేం గద్దెనెక్కుతాం... ఈ పరిస్థితి ఇంతటితో ఆగకపోతే... అప్పుడు మా వాళ్లు ఆగమన్నా ఆగే పరిస్థితి ఉండదు" అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు.
సాధారణంగా కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కొంచెం సమయం పడుతుందని, కానీ చంద్రబాబు ప్రభుత్వంపై చాలా త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా, దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో నెలకొన్న పరిస్థితులను ఇటీవల రాజకీయ పక్షాలకు వివరించామని, జాతీయస్థాయి నేతల దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. ఇప్పుడు జరిగిన దాడులను గవర్నర్ కు వివరిస్తామని, అవసరమైతే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు అయినా వెళతామని జగన్ స్పష్టం చేశారు.