USA: డొనాల్డ్ ట్రంప్ హత్యకు పాకిస్థాన్ వ్యక్తి కుట్ర.. ఎఫ్‌బీఐ చాకచక్యంగా అండర్ కవర్ ఆపరేషన్.. అరెస్ట్!
- ట్రంప్ హత్యకు కుట్ర విఫలమైందంటూ యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు
- అమెరికాలో రాజకీయ నాయకులను హత్య చేయాలని భావించిన నిందితుడు
- ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్టు గుర్తింపు
అమెరికా రాజకీయ నేతలను హత్య చేయాలని కుట్ర పన్నిన పాకిస్థాన్ పౌరుడిని అగ్రరాజ్యం అరెస్ట్ చేసింది. ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉన్న అతడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు పన్నాగం పన్నాడని, అయితే ఈ కుట్ర విఫలమైందంటూ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపింది. ఇందుకు సంబంధించిన కోర్టు పత్రాలు మంగళవారం బహిర్గతమయ్యాయి.
ఈ హత్యాయత్నం కుట్రపై అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు కూడా స్పందించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న, గతంలో పనిచేసిన అధికారులు కూడా టార్గెట్ లిస్టులో ఉన్నారని వెల్లడించారు. పాకిస్థానీ నిందితుడిని ఆసిఫ్ మర్చంట్‌గా(46) గుర్తించామని, కిరాయి హంతకులతో మాట్లాడేందుకు న్యూయార్క్ వచ్చాడని, ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరు ఆరంభంలో హత్య కుట్రలను అమలు చేయాలంటూ మాట్లాడాడని అధికారులు వివరించారు.
వల పన్ని.. నిందితుడి అరెస్టు..
జులై 12న కిరాయి హంతకులతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆసిఫ్ అమెరికాను వీడేందుకు సిద్ధమయ్యాడు. కిరాయిహంతకులు పని పూర్తి చేస్తారని అతడు భావించాడు. కానీ అతడితో మాట్లాడింది ఎఫ్‌బీఐ అండర్ కవర్ అధికారులు అని గుర్తించలేకపోయాడని ప్రాసిక్యూటర్ వివరించారు. కుట్రలో భాగంగా కిరాయి హంతకుడిని కలవడానికి సహాయం చేస్తాడని భావించిన వ్యక్తిని ఆసిఫ్ కలిశాడని, అయితే సదరు వ్యక్తి నేరుగా ఎఫ్‌బీఐకి సమాచారం అందించాడని చెప్పారు. సమాచారం అందడంతో ఎఫ్‌బీఐ అధికారులు రంగంలోకి దిగి రహస్యంగా ఆపరేషన్ చేపట్టారు. ప్లాన్‌లో భాగంగా జూన్ ఆరంభంలో కిరాయి హంతకులుగా ఎఫ్‌బీఐ అధికారులు నటించారు. హత్యలు ఒకేసారి చేయకూడదని చెప్పిన ఆసిఫ్ 5 వేల డాలర్లు అడ్వాన్స్‌గా చెల్లించినట్టు కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది.
హత్య కుట్రపై చర్చలు జరిపిన వెంటనే ఆసిఫ్ అమెరికా నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. అధికారులు తక్షణమే అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఫెడరల్ కస్టడీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌తో పాటు ఇస్లామిక్ ప్రపంచాన్ని బాధపెడుతున్న వ్యక్తులను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఆసిఫ్ అంగీకరించినట్టు కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.
ఎలాంటి దాడి జరగక ముందే ఆసిఫ్ కుట్రను భగ్నం చేసినట్టు ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ హత్య కుట్ర ఇరాన్‌కు తెలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే అప్పటికే ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందంటూ యూఎస్ సీక్రెట్ సర్వీసెస్‌కు ఇంటెలిజెన్స్ సమాచారం కూడా అందడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ పరిణామాలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఇతర ముఖ్యమైన నాయకుల భద్రతను అమెరికా ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది.