Vinesh Phogat: వినేశ్ ఫోగాట్ అనర్హతపై ఐఓఏ చీఫ్ తో మాట్లాడిన ప్రధాని మోదీ
- ఒలింపిక్స్ లో 50 కిలోల కేటగిరీలో ఫైనల్ చేరిన వినేశ్ ఫోగాట్
- 100 గ్రాముల బరువు అధికంగా ఉందంటూ అనర్హత వేటు
- స్వర్ణ/రజత పతక ఆశలు గల్లంతు
- పీటీ ఉషతో మాట్లాడి అసలేం జరిగిందో తెలుసుకున్న ప్రధాని మోదీ
మహిళల రెజ్లింగ్ లో 50 కిలోల కేటగిరీలో స్వర్ణం కానీ, రజతం కానీ ఏదో ఒక పతకం తీసుకువస్తుందని స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పై పెట్టుకున్న ఆశలు నిబంధనల కారణంగా ఆవిరయ్యాయి. నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందంటూ వినేశ్ ఫోగాట్ పై అనర్హత వేటు పడింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సహా అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కాగా, వినేశ్ అనర్హతపై ప్రధాని మోదీ భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) చీఫ్ పీటీ ఉషతో ఫోన్ ద్వారా మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్ లో అసలేం జరిగింది? అంటూ పీటీ ఉషను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వినేశ్ ఫోగాట్ అనర్హతకు దారితీసిన అంశాలను పీటీ ఉష ప్రధానికి వివరించారు.
వినేశ్ కు మనం ఏమైనా సాయపడగలమా? ఏమైనా మార్గాలు ఉన్నాయా? అని ప్రధాని అడిగారు. ఒకవేళ వినేశ్ కు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే, ఒలింపిక్స్ లో గట్టిగా నిరసన తెలపండి అంటూ పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించారు. వినేశ్ కు తమ పూర్తి మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు.