Vinesh Phogat: అనర్హత వేటు తర్వాత ఆసుపత్రి పాలైన వినేశ్ ఫోగాట్
- డీహైడ్రేషన్ కారణంగా ఆమెకు అనారోగ్యం
- బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా నిద్రపోకుండా కసరత్తులు
- దీని కారణంగానే వినేశ్ ఇప్పుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు క్రీడా వర్గాల సమాచారం
- ఒలింపిక్ గ్రామంలోని ఓ పాలిక్లినిక్ లో చికిత్స
భారత స్టార్ అథ్లెట్ వినేశ్ ఫోగాట్ అస్వస్థతకు గురైంది. డీహైడ్రేషన్ కారణంగా ఆమె అనారోగ్యం బారిన పడింది. దాంతో వినేశ్‌ను పారిస్ ఒలింపిక్ గ్రామంలోని ఓ క్లినిక్ లో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని సమాచారం. వినేశ్ ఇవాళ రాత్రి మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్ ఆడాల్సి ఉండగా, 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడింది.
నిన్న బౌట్ సమయంలో ఆమె తన బరువు నియంత్రణలోనే ఉంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ రెండు కిలోల అధిక బరువు ఉన్నారు. దీంతో జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి బరువు తగ్గేందుకు దోహదపడే కసరత్తులు చేశారు.
అంతేకాకుండా భోజనం కూడా తీసుకోకుండా, బరువును తగ్గించుకునేందుకు రాత్రంతా ఆమె నిద్రపోకుండా మేల్కొనే ఉన్నట్లు సమాచారం. దీని కారణంగానే వినేశ్ ఇప్పుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు క్రీడా వర్గాల సమాచారం.
ఆమె ఒలింపిక్ గ్రామంలోని ఓ పాలిక్లినిక్ లో చికిత్స అందుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
"కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల అనర్హత వేటు పడింది. దయచేసి వినేశ్ ఫోగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని కోరుతున్నాం. ఇది అత్యంత బాధాకరం" అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది.