Dr Suneetha Reddy: ఏపీ హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి

Viveka daughter Dr Suneetha Reddy met AP Home Minister Anitha
  • తన తండ్రి హత్య కేసులో న్యాయం చేయాలని అనితను కోరిన సునీత
  • 2019 నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలు వివరించిన వివేకా కుమార్తె
  • సునీతకు భరోసా ఇచ్చిన అనిత
  • కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వెల్లడి
దారుణ హత్యకు గురైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి నేడు ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి వివేకా హత్య కేసులో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల కిందట తన తండ్రి హత్యకు గురైనప్పటి నుంచి, ఇప్పటివరకు జరిగిన అన్ని పరిణామాలను సునీతారెడ్డి హోంమంత్రి అనితకు వివరించారు.

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కొందరు పోలీసు అధికారులు వివేకా హంతకులకు కొమ్ముకాశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా, దర్యాప్తు సందర్భంగా కొందరు పోలీసు అధికారులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని కూడా సునీతారెడ్డి వివరించారు. ఆఖరికి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే తప్పుడు కేసులు పెట్టారని, సాక్షులను బెదిరించారని ఆరోపించారు. 

ఈ సందర్భంగా సునీతారెడ్డికి ఏపీ హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని అనిత స్పష్టం చేశారు. 

ఈ కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను వదిలేది లేదని అన్నారు.
Dr Suneetha Reddy
ANitha
Home Minister
YS Viveka Murder Case
Andhra Pradesh

More Telugu News