Japan: జపాన్‌లో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ... ఇవిగో వీడియోలు!
- స్వల్ప వ్యవధిలో రెండుసార్లు భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 7.1, 6.9గా నమోదు
- క్యుషు తూర్పు తీరంలో 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.
జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. క్యుషు దక్షిణ తీరం, సమీపంలోని షికోకు ద్వీపంలో అలలు 1 మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయని సునామీ హెచ్చరికను జారీ చేసింది.
క్యుషు, షికోకులోని న్యూక్లియర్ ప్లాంట్లలో ఏమైనా నష్టం జరిగిందా అనేది పరిశీలిస్తున్నామని ఆపరేటర్లు చెప్పినట్లు తెలిపింది. సమీపంలోని మియాజాకి విమానాశ్రయంలో కిటికీలు ధ్వంసమైనట్లు ఎన్‌హెచ్‌కే పబ్లిక్ టెలివిజన్ తెలిపింది. జపాన్ నార్త్ సెంట్రల్ రీజియన్‌లో జనవరి 1న సంభవించిన భూకంపంతో 240 మంది చనిపోయారు.