Tsunami: జపాన్ తీరాన్ని తాకిన సునామీ
- జపాన్ లో నేడు రెండుసార్లు భూకంపం
- రిక్టర్ స్కేల్ పై 7.1, 6.9గా నమోదు
- సునామీ హెచ్చరికలు జారీ
జపాన్ లో ఇవాళ 7.1, 6.9 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయి. దాంతో జపాన్ ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ హెచ్చరికలను నిజం చేస్తూ, 50 సెంటీమీటర్ల మేర సునామీ జపాన్ తీరాన్ని తాకింది. దక్షిణ మియజాకి రాష్ట్రంలోని మియజాకి పోర్ట్ ను సునామీ తాకినట్టు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఎలాంటి నష్టం వాటిల్లినట్టు ఇప్పటివరకు వివరాలు లేవు.
కాగా, భూ ప్రకంపనలు వచ్చిన ప్రాంతంలో అణు కేంద్రాలు ఉండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, భూకంపం ప్రభావం అణు కేంద్రాలపై పడలేదని క్యోడో న్యూస్ సంస్థ వెల్లడించింది. భూకంపం తర్వాత క్యుషు ద్వీపంలో బుల్లెట్ రైలు సేవలను నిలిపివేశారు.