Pawan Kalyan: తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక భూములు... పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!

Pawan Kalyan talks about Karnataka state lands in Tirupati and Srisailam

  • నేడు కర్ణాటకలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • సీఎం సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ లతో భేటీ
  • అనంతరం బెంగళూరులో మీడియా సమావేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు కర్ణాటకలో పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ లతో పవన్ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బెంగళూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. 

తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్ర భూములు ఉన్నాయని, వాటి పునరుద్ధరణ (రెన్యువల్)కు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుకు వివరిస్తానని, త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ, అవి భారతదేశం మొత్తానికి చెందిన వారసత్వ సంపద అని స్పష్టం చేశారు. 

మనం రాజకీయ పార్టీలుగా వేర్వేరు కావచ్చు... కానీ మనం అంతా ఒకే దేశ ప్రజలం, ఒకే సంస్కృతికి చెందినవాళ్లం అని పవన్ కల్యాణ్ వివరించారు. 

భూమి అనేది కేవలం మనుషులదే కాదు... అన్ని జంతువులది, జీవ జాతులకు కూడా చెందినది... వసుధైక కుటుంబం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పర్యావరణాన్ని, అడవులను పరిరక్షించుకోవాలని అన్నారు. తాను డిప్యూటీ సీఎం పదవిలోకి రాకముందు నుంచి ప్రకృతి సంరక్షకుడ్నని, ఇప్పుడు అటవీశాఖ మంత్రిగా తనపై మరింత బాధ్యత ఉందని భావిస్తానని తెలిపారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తనకు కన్నడ భాష అంటే చాలా ఇష్టం అని, సరిహద్దులు పంచుకుంటున్నప్పటికీ కన్నడ భాషలో మాట్లాడలేకపోతున్నందుకు బాధగా ఉందని అన్నారు. కన్నడ భాష నేర్చుకుని హృదయం లోతుల్లోంచి మాట్లాడాలని ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News