Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రా.. ప్రధాని మోదీ ప్రశంసలు

Neeraj Chopra recorded his season best throw to win silver in the mens javelin event at the Paris Olympics
  • సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటిన భారత స్టార్ అథ్లెట్
  • వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ పతకాన్ని ముద్దాడిన నీరజ్ చోప్రా
  • ప్రశంసల జల్లు కురిపించిన ప్రధాని మోదీ
  • జావెలిన్ త్రోలో అనూహ్యంగా స్వర్ణాన్ని గెలిచిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ చరిత్ర సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో రజతాన్ని ముద్దాడాడు. సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటాడు. కాగా అనూహ్య రీతిలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించాడు. ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లు కాగా 92.97 మీటర్ల దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు. దీంతో రెండో స్థానంలో నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాగా పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. క్వాలిఫయర్ రౌండ్‌లో 89.34 మీటర్ల త్రో విసిరి ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే ఫైనల్‌లో మొదటి ప్రయత్నంలోనే ఫౌల్ కావడంతో నీరజ్ చోప్రాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. అయితే తర్వాత త్రోకి అద్భుతంగా పుంజుకొని బల్లేన్ని ఏకంగా 89.34 మీటర్ల దూరం విసిరాడు. అయితే అంతకంటే ముందే పాకిస్థాన్‌ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రో విసిరాడు. చోప్రా మరింత ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.

ప్రధాని మోదీ ప్రశంసలు..
పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చోప్రా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని, అతడొక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మరో ఒలింపిక్స్‌లోనూ అతడు ప్రతిభ చాటడంతో భారత్ హర్షం వ్యక్తం చేస్తోందని అన్నారు. రజతం సాధించిన అతడికి అభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్ తరాల అథ్లెట్‌లను నీరజ్ చోప్రా ప్రోత్సహిస్తూనే ఉంటాడని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు.

రికార్డు బద్దలు కొట్టిన పాక్ ఆటగాడు..
ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఆల్-టైమ్ రికార్డు 90.57 మీటర్లుగా ఉంది. ఈ రికార్డును పాకిస్థానీ అథ్లెట్ అర్షద్ నదీమ్ బద్దలు కొట్టాడు. ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఇతర ప్రయత్నాల్లో 88.72 మీటర్ల కంటే ఎక్కువ దూరం విసరలేకపోయాడు.

జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా ట్రాక్ రికార్డు ఇదే..
1. పారిస్ ఒలింపిక్స్  - రజతం
2. టోక్యో ఒలింపిక్స్ - స్వర్ణం
3. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్ - స్వర్ణం
4. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ - రజతం
5. 2023 డైమండ్ లీగ్ - రెండవ స్థానం
6. 2022 డైమండ్ లీగ్ - తొలి స్థానం
7. 2022 ఆసియా గేమ్స్ - స్వర్ణం
8. 2018 ఆసియా గేమ్స్ - స్వర్ణం
9. 2018 కామన్వెల్త్ గేమ్స్ - స్వర్ణం
Neeraj Chopra
javelin Throw
Paris Olympics
Arshad Nadeem
Pakistan

More Telugu News