KTR: కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుంది: కేటీఆర్

KTR responds on Sisodia bail

  • కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడి
  • జైల్లో ఉన్న కవిత 11 కిలోలు తగ్గారన్న కేటీఆర్
  • ఛార్జిషీట్ దాఖలు చేశాక జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్న

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుందని భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో తన సోదరికి బెయిల్ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న కవిత 11 కిలోలు బరువు తగ్గినట్లు చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశాక ఇంకా జైల్లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ కేసులో మనీశ్ సిసోడియాకు ఇప్పటికే బెయిల్ లభించినట్లు చెప్పారు.

సుంకిశాల ప్రమాదాన్ని దాచిపెట్టారు

సుంకిశాల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవం తెచ్చిందే కేసీఆర్ ప్రభుత్వమన్నారు. హైదరాబాద్‌ నీటి అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్టును మొదలుపెట్టారని, అయితే దానిని నల్గొండ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా హైదరాబాద్‌కు నీటికష్టాలు రాకూడదనే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగునీటి కోసం సుంకిశాల ఉపయోగపడుతుందన్నారు.

కృష్ణానదికి నాలుగేళ్లు నీళ్లు రాకపోయినా ఈ ప్రాజెక్టు కారణంగా ఇబ్బందులు ఉండవన్నారు. అదే ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో నీటికోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నీటికోసం ఇబ్బందులు పడే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా తమ హయాంలో ప్రణాళికలు రూపొందించామన్నారు. సుంకిశాల ఘటనను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందో చెప్పాలన్నారు. ఆగస్ట్ 2న ఉదయం 6 గంటలకు సుంకిశాల ప్రమాదం జరిగితే ప్రభుత్వానికి సమాచారం లేదా? లేక విషయాన్ని దాచిపెట్టారా? అని ప్రశ్నించారు.

ఒకవేళ ఈ విషయం ప్రభుత్వానికి తెలియకపోతే అది సిగ్గుచేటన్నారు. త్వరత్వరగా పనులు చేయాలని హడావిడిగా గేట్లు పెట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతో గోడ కూలిందన్నారు. పనులు చేస్తున్న ఏజెన్సీని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుంకిశాల ఘటనపై న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుంకిశాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

మున్సిపల్ శాఖను తనవద్ద పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. మేడిగడ్డలో ఏమైనా జరిగితే కేంద్రం స్పందిస్తుందని, ఇప్పుడు బీజేపీ ఏం చెబుతుందని కేటీఆర్‌ నిలదీశారు. మేడిగడ్డ ఘటన ఎన్నికల సమయంలో జరిగినప్పటికీ దానిని దాచిపెట్టలేదన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లతో కలిసి సుంకిశాలను త్వరలో బీఆర్‌ఎస్ బృందం సందర్శిస్తుందన్నారు. కాంగ్రెస్‌ నేతల చిల్లర ప్రచారానికి ప్రకృతే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News