Narendra Modi: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు... మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Centre sets up 5 member committee to monitor India Bangladesh border situation

  • ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ
  • భారతీయులు, హిందువులు, మైనార్టీల భద్రతను పర్యవేక్షించనున్న కమిటీ
  • బంగ్లాదేశ్‌లో హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతుండటంతో నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలపై దాడుల ఘటన మీద భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను... సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్రం ఐదుగురు సభ్యులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో భారతీయులు, హిందువులు, ఇతర మైనార్టీల భద్రతను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

బంగ్లాదేశ్ లోని భారతీయులు, హిందువులు, మైనార్టీల భద్రత, సౌకర్యాలకు సంబంధించి అక్కడి హోంమంత్రిత్వ శాఖ అధికారులతో ఈ కమిటీ చర్చలు జరుపుతుంది. ఈ కమిటీలో బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఐజీ, బీఎస్ఎఫ్ త్రిపుర ఐజీ, ఇండియన్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీకి చెందిన ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సభ్యుడు, సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడి మైనార్టీ వర్గాల భద్రత కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

ఇస్లామిక్ ఛాందసవాదులు బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం మొదలైన దాడుల్లో ఇప్పటి వరకు వందలాది మంది మృతి చెందారు. దాడుల భయంతో హిందువులు సహా చాలా మైనార్టీ కుటుంబాలు మూకుమ్మడిగా వలస బాట పట్టాయి. వారు భారత్‌లోకి వచ్చేందుకు యత్నిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని ఠాకూర్‌గావ్‌, పంచగఢ్‌ ప్రాంతాలకు వేలాదిమంది హిందువులు చేరుకున్నారు. పలుచోట్ల ఇళ్లు, దుకాణాలతో పాటు దేవాలయాల్లోని విలువైన వస్తువులను సైతం దుండగులు దోచుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

  • Loading...

More Telugu News