Arshad Nadeem: జావెలిన్‌త్రో స్వ‌ర్ణ ప‌త‌క విజేత‌ అర్ష‌ద్ కు భారీ న‌గ‌దు బ‌హుమ‌తి.. అత‌ని పేరుపై స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు

Punjab CM Maryam Nawaz announces Rs 10 crore reward for Arshad Nadeem
  • గోల్డ్ మెడ‌ల్ సాధించిన అర్షద్‌ నదీమ్‌కు రూ.10 కోట్ల రివార్డు 
  • ఈ మేర‌కు పంజాబ్ ప్రావిన్స్ సీఎం మర్యమ్‌ నవాజ్‌ షరీఫ్ ప్ర‌క‌ట‌న‌
  • మియాన్ చానులో అర్షద్ నదీమ్ పేరిట స్పోర్ట్స్ సిటీ నిర్మాణం
  • జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ గెలిచిన నదీమ్
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల‌ జావెలిన్‌ త్రో ఈవెంట్‌లో పాకిస్థాన్‌కు చెందిన అర్ష‌ద్ న‌దీమ్ స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన విష‌యం తెలిసిందే. దాంతో ఇప్పుడు అత‌నిపై క‌న‌క‌వ‌ర్షం కురుస్తోంది. గోల్డ్ మెడ‌ల్ సాధించిన అర్షద్‌ నదీమ్‌కు పంజాబ్ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి మర్యమ్‌ నవాజ్‌ షరీఫ్‌ రూ.10 కోట్ల రివార్డును ప్రకటించారు. నదీమ్ బంగారు పతకం సాధించి దేశానికి స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అందించారని ఈ సంద‌ర్భంగా సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

అలాగే అర్షద్ నదీమ్ పేరుతో స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని ప్రకటించారు. మియాన్ చాను అర్షద్ నదీమ్ స్పోర్ట్స్ సిటీగా మారుతుందని అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా అర్షద్ నదీమ్ 40 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు బంగారు పతకాన్ని అందించాడ‌ని కొనియాడారు. ఒలింపిక్స్‌లో వ‌ర‌ల్డ్‌ రికార్డు నెల‌కొల్ప‌డం అర్షద్ నదీమ్ కృషి, అంకితభావం, జాతీయ స్ఫూర్తికి నిదర్శనం అన్నారు. ప్రపంచంలో పాకిస్థాన్ జెండాను ఎగురవేసే ప్రతి కొడుకు, కూతురికి ఎల్లవేళలా అల్లా అండ ఉంటుంద‌న్నారు.

కాగా, అర్షద్ జావెలిన్‌ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడ‌ల్‌ ద‌క్కించుకున్నాడు. అలాగే ఒలింపిక్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు కూడా నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఉన్న ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లను నదీమ్ (92.97 మీ) అధిగ‌మించాడు.
Arshad Nadeem
Maryam Nawaz
Reward
Pakistan
Paris Olympics
Gold Medal

More Telugu News