Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై భార్య వాణి ఫైర్ .. తీవ్ర ఆరోపణలు

YCP MLC Duvvada Srinivas wifs made allegations on him
  • మరోసారి వీధికెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయితీ
  • భర్తపై తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి
  • పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినా మార్పు రాలేదని ఆవేదన
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయితీ మరోసారి వీధికెక్కింది. దువ్వాడ గత కొంత కాలంగా ఇంటికి రాకుండా వేరే మహిళతో సహజీవనం సాగిస్తుండటంతో ఆయన భార్య, పిల్లలు మీడియా ముందుకు వచ్చి శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనతో ఉంటున్న మహిళపై కూడా ఆరోపణలు గుప్పించారు. 

టెక్కలిలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్న శ్రీనివాస్‌ను కలిసేందుకు ఆయన కుమార్తెలు గురువారం ప్రయత్నించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకూ ఆ ఇంటి వద్దే కారులో కూర్చుని నిరీక్షించినా శ్రీనివాస్ వారితో మాట్లాడేందుకు నిరాకరించారు. దీంతో వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో శుక్రవారం శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి (వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు), పెద్ద కుమార్తె హైందవి మీడియా ముందుకు వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ గౌరవాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, రాజకీయ జీవితాన్ని శ్రీనివాస్ మంటగలుపుతున్నాడంటూ వాపోయారు.

తన తాత లక్ష్మీపతి దొర, తండ్రి రాఘవరావు దొర, తాను వందల ఎకరాలు అమ్ముకుని రాజకీయం చేశామని, తన భర్తగా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ చేరి నమ్ముకున్న కార్యకర్తలను, పార్టీని, కుటుంబాన్ని నట్టేట ముంచేసి రోడ్డున పడేశారంటూ వాణి విమర్శించారు. తన భర్త తీరుపై గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, వైసీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీనివాస్ వైఖరి వల్ల కేవలం తాము మాత్రమే నష్టపోవడం లేదని, పార్టీ కార్యకర్తలు అంతా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చాలా మంది జీవితాలను నాశనం చేసిన మహిళ ఉచ్చులో తన భర్త చిక్కుకున్నాడని, ఆమెతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ఆరోపించారు.
Duvvada Srinivas
Duvvada Vani
YSRCP
Srikakulam District

More Telugu News