Vangalapudi Anitha: లోన్ యాప్స్, హనీట్రాప్ ఊబిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: వంగలపూడి అనిత
- సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్
- దేశంలో సైబర్ నేరాలు 24 శాతం వరకు పెరిగాయన్న అనిత
- ప్రజలు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే మోసాలకు కారణమవుతుందని హెచ్చరిక
లోన్ యాప్‌లు, హనీట్రాప్, ఇతర యాప్‌ల ఊబిలో పడి కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కోసం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. 16 రకాల సైబర్ మోసాలపై అవగాహన ఫిర్యాదుల కోసం రూపొందించిన యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో 24 శాతం వరకు సైబర్ నేరాలు పెరిగాయన్నారు.
నాలుగు నెలల్లోనే దేశవ్యాప్తంగా రూ.1,730 కోట్ల సైబర్ నేరాలు జరిగాయన్నారు. నిత్యం వినియోగించే అనేక యాప్స్ ద్వారా భారీ మోసాలు జరుగుతున్నాయన్నారు. సోషల్ మీడియాకు, యాప్‌లకు ప్రజలు అందిస్తున్న వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతుందన్నారు. అందుకే మోసపూరిత యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి జిల్లాలోనూ సైబర్ సెల్ చురుగ్గా పని చేయాలని సూచించారు.