Hindenburg: సెబీ చైర్ పర్సన్ పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్ బర్గ్
- సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త కు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు ఉన్నాయని పేర్కొన్న హిండెన్ బర్గ్
- ఉదయం ఎక్స్ వేదికగా హింట్ ఇచ్చి సాయంత్రానికి బాంబ్ పేల్చిన హిండెన్ బర్గ్
- హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలపై స్పందించని సెబీ
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలకు పాల్పడిందని, కంపెనీల ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ గత ఏడాది జనవరిలో సంచలన ఆరోపణలతో నివేదిక వెలువరించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ తాజాగా భారత్ పై మరో బాంబ్ వేసింది. శనివారం ఉదయం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ హిండెన్ బర్గ్ హింట్ ఇవ్వడం సంచలనాన్ని రేకెత్తించింది.
అనుకున్నట్లుగానే సాయంత్రానికి సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ పై హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషన్ ఫండ్ లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజాగా ఆరోపించింది. ఈ మేరకు విజిల్ బ్లోయర్ నుండి తమకు సమాచారం అందిందని హిండెన్ బర్గ్ పేర్కొంది.
అదానీకి చెందిన మారిషన్, అఫ్ షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ నియంత్రణలో కొన్ని అఫ్ ఫోర్ బెర్ముడా, మారిషస్ ఫండ్ లో మాధవి పురి, ఆమె భర్త ధావల్ బచ్ లకు వాటాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ పేర్కొంది. దీనిపై సెబీ స్పందించలేదు.