Sebi Chief: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించిన సెబీ చీఫ్!
- అదానీ సంస్థల ఆఫ్‌షోర్ ఫండ్లలో సెబీ చీఫ్‌కు, ఆమె భర్తకు వాటాలున్నాయన్న హిండెన్‌బర్గ్
- హిండెన్ బర్గ్ ఆరోపరణలపై సెబీ చీఫ్, ఆమె భర్త ప్రకటన విడుదల
- తమ ఆర్థిక లావాదేవీలు తెరిచిన పుస్తకమని వ్యాఖ్య
- సెబీకి ఎప్పటికప్పుడు తమ ఆర్థికాంశాల డాక్యుమెంట్స్ సమర్పిస్తున్నామని స్పష్టీకరణ
అదానీ సంస్థలకు సంబంధించి ఆఫ్‌షోర్ ఫండ్లలో సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్, ఆమె భర్తకు వాటాలున్నాయని అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ ఆరోపణలను పురి బచ్ దంపతులు నిర్ద్వంద్వంగా తొసిపుచ్చారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది తమ వ్యక్తిత్వ హననానికి జరుగుతున్న ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమని, వాటిల్లో నిజం లేదని స్పష్టం చేశారు.
తమ ఆర్థిక వ్యవహారాలన్నీ తెరిచిన పుస్తకమేనని పురి బచ్ దంపతులు వ్యాఖ్యానించారు. తమ ఆర్థికాంశాలకు సంబంధించి సెబీకి కొన్నేళ్లుగా అన్ని వివరాలు సమర్పిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ వివరాలను సంబంధిత అధికారులకు అడిగిన వెంటనే అప్పగించేందుకు వెనకాడబోమని పేర్కొన్నారు. తాము ప్రైవేటు వ్యక్తులుగా ఉన్నప్పటి ఆర్థికలావాదేవీల డాక్యుమెంట్లు సమర్పించేందుకూ సిద్ధమని ప్రకటించారు.
తమ షేర్ల విలువను కృత్రిమంగా పెంచేందుకు అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందని, కంపెనీ ఖాతాల్లో మోసాలకు తెరతీసిందని హిండెన్‌బర్గ్ గతేడాది సంచలన ఆరోపణలు చేసింది. దీనికి కొనసాగింపుగా సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌పై తాజాగా మరిన్ని ఆరోపణలు గుప్పించింది. అదానీ షేర్ల విలువను పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలున్నాయని బాంబు పేల్చింది. అదానీ సంస్థలకు విదేశాల్లో ఉన్న షెల్ సంస్థల వివరాలను తెలుసుకునేందుకు సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని వ్యాఖ్యానించింది. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది.