Harish Rao: బీఆర్ఎస్ చేసిన పనులను కూడా తామే చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు: హరీశ్ రావు
- ఖమ్మం కరవు బాధలు తీర్చాలని కేసీఆర్ సీతారామకు రూపకల్పన చేశారన్న హరీశ్ రావు
- ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించారని వెల్లడి
- కాంగ్రెస్ నేతల మాటలు, ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారన్న హరీశ్ రావు
బీఆర్ఎస్ చేసిన ప్రతి మంచి పనిని, ఇచ్చిన ఉద్యోగాలను తామే చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాకు కరవు బాధలు తీర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు సంకల్పం చేశారన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానిని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు.
ఈ ఎనిమిది నెలల్లోనే సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా? అని నిలదీశారు. కాంగ్రెస్ నేతల మాటలు, ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఖమ్మంకు చుక్క నీరు ఇవ్వలేదని, కానీ కేసీఆర్ ఈ జిల్లాలో రెండు పంటలు పండే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేశారన్నారు. వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు.