Saroj Devi: నీరజ్ చోప్రా తల్లి ట్వీట్ కు బదులిచ్చిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్

Neeraj Chopra Mother Called Arshad Nadeem Like My Son Pakistan Star Reply Is Viral
  • పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ‌ల్‌ ద‌క్కించుకున్న అర్షద్ న‌దీమ్‌
  • జావెలిన్‌ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరిన పాక్ అథ్లెట్‌ 
  • సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లతో రజతం సాధించిన నీర‌జ్ చోప్రా
  • నదీమ్ ను కూడా తనకు కొడుకు లాంటివాడని చెప్పిన నీరజ్ తల్లి సరోజ్ దేవి
  • తన కోసం కూడా ప్రార్థించినందుకు సరోజ్ దేవికి కృతజ్ఞతలు తెలిపిన‌ న‌దీమ్‌
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల‌ జావెలిన్‌ త్రోలో పాకిస్థాన్‌కు చెందిన అర్ష‌ద్ న‌దీమ్ స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన విష‌యం తెలిసిందే. అర్షద్ జావెలిన్‌ను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడ‌ల్‌ ద‌క్కించుకున్నాడు. అలాగే ఒలింపిక్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు కూడా నెల‌కొల్పాడు. ఇంత‌కుముందు ఉన్న ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లను నదీమ్ (92.97 మీ) అధిగ‌మించాడు. ఇక భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా తన సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లతో రజతం సాధించాడు. 

ఈ సంద‌ర్భంగా నీరజ్ తల్లి సరోజ్ దేవిని నదీమ్ గురించి అడగగా అతను కూడా తనకు కొడుకు లాంటివాడని చెప్పారు. ఆమె ప్రకటనపై పాక్ అథ్లెట్ తాజాగా స్పందిస్తూ.. ఆమె తన కోసం కూడా ప్రార్థించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఆమె కూడా తనకు తల్లిలాంటివారేన‌ని అన్నాడు.

"ఒక తల్లి ప్రతి ఒక్కరికీ తల్లి. కాబట్టి ఆమె అందరి కోసం ప్రార్థిస్తుంది. నీరజ్ చోప్రా తల్లికి నేను కృతజ్ఞుడను. వో భీ మేరీ మా హై (ఆమె కూడా నా తల్లి). ఆమె మా కోసం ప్రార్థించింది. దక్షిణాసియాకు చెందిన మేము ఇద్దరు క్రీడాకారులం మాత్ర‌మే ప్రపంచ వేదికపై ప్రదర్శన ఇచ్చాం" అని స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నదీమ్ పాక్ మీడియాతో అన్నాడు.

ఇక న‌దీమ్‌పై పాక్‌లో క‌న‌క‌వ‌ర్షం కురుస్తోంది. అత‌ని సొంత రాష్ట్ర‌మైన పంజాబ్ ప్రావిన్స్ రూ. 10 కోట్ల (పాకిస్థానీ కరెన్సీ) రివార్డు ప్ర‌క‌టించింది. అలాగే పాక్ ప్ర‌భుత్వం కూడా నాలుగున్న‌ర కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించింది. దీంతో దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం హిలాల్-ఎ-ఇమ్తియాజ్‌తో సత్కరించ‌నుంది. 

అలాగే వచ్చే వారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'అజ్మ్-ఇ-ఇస్తేహ్కామ్' (స్థిరత్వానికి నిబద్ధత) పేరుతో స్మారక స్టాంపును విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించింది. అటు “అర్షద్ నదీమ్ అద్భుతమైన ప్రదర్శన ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేసింది. అథ్లెటిక్స్‌లో అతని అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణం' అని అధ్యక్షుడు జర్దారీ తన లేఖలో పేర్కొన్నారు.
Saroj Devi
Neeraj Chopra
Arshad Nadeem
Paris Olympics
Sports News

More Telugu News