KTR: కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ పై హత్యాచారం... స్పందించిన కేటీఆర్
- ఆసుపత్రి ప్రాంగణంలోనే జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందన్న కేటీఆర్
- ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టిన వారిని వదిలి పెట్టకూడదన్న కేటీఆర్
- హత్యాచారంపై నిరసన తెలుపుతున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు సానుభూతి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ఇంత క్రూరత్వానికి ఒడిగట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టకూడదన్నారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మమత ప్రభుత్వం నేరస్తుడిని పట్టుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. హత్యాచారంపై బెంగాల్లో నిరసన తెలుపుతున్న వైద్యులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆసుపత్రుల్లోనే డాక్టర్లు సురక్షితంగా ఉండలేకపోతే... ఇక ఆడపిల్లలు బయట క్షేమంగా ఉండగలరా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేశారు. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్‌కి ఇదివరకే నాలుగుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. అతని ప్రవర్తన కారణంగా ముగ్గురు భార్యలు అతనిని వదిలి వెళ్లారు. నాలుగో భార్య ఏడాది క్రితం చనిపోయింది. సంజయ్ రాయ్ పోలీస్ పౌర వాలంటీర్‌గా పని చేస్తున్నాడు.