Pawan Kalyan: ఆయన దూరదృష్టి వల్లే మన అంతరిక్ష రంగం ఈస్థాయికి ఎదిగింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఇవాళ మన దేశం అంతరిక్ష పరిశోధన, అనుబంధ రంగాల్లో గణనీయ విజయాలు సాధిస్తోందంటే... స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే ఈ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ దూరదృష్టే కారణమని పేర్కొన్నారు.
ఒక శాస్త్రవేత్త దేశం గురించి, తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో దివంగత విక్రమ్ సారాభాయ్ జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుందని పవన్ కల్యాణ్ వివరించారు. ఫిజిక్స్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, భారత్ కు శాటిలైట్ ఉండాల్సిన ఆవశ్యకతను నాటి ప్రధాని నెహ్రూకు వివరించడం, ఆయనను ఒప్పించడం, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పడం ద్వారా భారతదేశ అంతరిక్ష అభివృద్ధికి విక్రమ్ సారాభాయ్ నాది పలికారని తెలిపారు.
ఇవాళ ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశం అంతర్జాతీయంగా అర్థవంతమైన పాత్ర పోషించాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సామాజిక సమస్యల పరిష్కారినికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని విక్రమ్ సారాభాయ్ చెప్పిన మాటలను ఇప్పటితరం శాస్త్రవేత్తలు ఆచరించి చూపాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
సారాభాయ్ అందించిన స్ఫూర్తితో శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా సమాజానికి మేలు కలిగించే మరిన్ని పరిశోధనలు ఆవిష్కృతం కావాలని ఆకాంక్షించారు.