WI Vs SA: డ్రాగా ముగిసిన విండీస్, సఫారీ తొలి టెస్టు.. 74 ఏళ్ల రికార్డు బ్రేక్!
- ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు
- దాదాపు 384 రోజులకు టెస్టుల్లో తొలి డ్రా నమోదు
- దాంతో 377 రోజులతో ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయిన వైనం
- 1960 – 1970ల మధ్య 377 రోజుల తర్వాత తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ డ్రా
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, ప్రపంచ టెస్టు క్రికెట్లో 74 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఓ రికార్డు ఈ మ్యాచ్ ద్వారా బ్రేక్ అయింది. టెస్టు ఫార్మాట్లో 28 మ్యాచ్‌ల తర్వాత ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాదాపు 384 రోజులకు టెస్టుల్లో తొలి డ్రా నమోదైంది. దాంతో 377 రోజులతో ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 1960 – 1970ల మధ్య 377 రోజుల తర్వాత తొలిసారి ఓ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇక ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్‌కు గురైన కరేబియన్ జట్టు స్వదేశంలో బోణీ కొట్టలేకపోయింది. ట్రినిడాడ్ టెస్టులో మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, మొదటి వర్షం కారణంగా పూర్తి ఆట కొనసాగలేదు. కేవలం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది. రెండో రోజు మొత్తం ఆడిన సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 357 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్.. కేశవ్ మహరాజ్(4/76), కగిసో రబడ(3/56) ల ధాటికి 233 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన బవుమా సేన 173/3 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఐదోరోజు కరేబియన్ జట్టు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. దాంతో ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో రాణించిన కేశవ్ మహారాజ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.