Arvind Kejriwal: జైలు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌కు కేజ్రీవాల్ లేఖ... జైలు అధికారుల అభ్యంతరం
- తాను జైల్లో ఉన్నందున తన స్థానంలో అతిశీ జెండా ఎగురవేస్తారని పేర్కొన్న కేజ్రీవాల్
- కేజ్రీవాల్ నిబంధనలను ఉల్లంఘించారంటున్న జైలు అధికారులు
- జైలు నిబంధనల ప్రకారం వ్యక్తిగత విషయాలు మాత్రమే లేఖలో ఉండాలని వెల్లడి
తాను జైల్లో ఉన్న కారణంగా ఆగస్ట్ 15న జరగనున్న స్వతంత్ర వేడుకల్లో తన స్థానంలో మంత్రి అతిశీ జెండా ఎగురవేస్తారని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆయన జైలు నుంచే ఈ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
జైలు అధికారులు ముఖ్యమంత్రి చర్యలను ఖండించారు. ఆయన జైలు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం జైల్లో ఉన్న వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను మాత్రమే లేఖలో పేర్కొనవలసి ఉంటుందని, కానీ కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాశారని జైలు అధికారులు తెలిపారు. అందులో స్వాతంత్ర వేడుకల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, అందుకే ఈ లేఖ బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు.
ఈ లేఖ లెఫ్టినెంట్ గవర్నర్‌కు చేరుకోలేదు. కానీ అందులోని విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ అధికార దుర్వినియోగం చేస్తున్నారని జైలు అధికారులు ఆరోపించారు. జైలు నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు, తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విషయమై తమకు మెయిల్ అభ్యర్థన పంపించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు.