Neeraj Chopra: జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన పాక్ అథ్లెట్ నదీమ్, రజతం గెలిచిన నీరజ్ చోప్రా ఆస్తుల లెక్కలు ఇవే!
- నీరజ్ చోప్రా నికర ఆస్తి విలువ రూ.37 కోట్లుగా అంచనా
- అర్షద్ నదీమ్ ఆస్తి రూ.1 కోటి లోపే ఉంటుందంటున్న రిపోర్టులు
- పారిస్ ఒలింపిక్స్ తర్వాత జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా వర్సెస్ నదీమ్
జావెలిన్ త్రో ఒకప్పుడు యూరప్ ఆటగాళ్ల ఆధిపత్యం ఉండేది. ప్రపంచ స్థాయిలో వారే ఎక్కువ పతకాలు సాధించేవారు. అయితే ఇప్పుడు భారత అథ్లెట్ నీరజ్ చోప్రా, పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ ఇద్దరూ జావెలిన్ త్రోలో మొనగాళ్లుగా మారారు. దక్షిణాసియా ఆధిపత్యాన్ని చాటిచెప్పారు.
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలవగా.. అర్షద్ నదీమ్ ఏకంగా 92.97 మీటర్లు విసిరి స్వర్ణం గెలిచారు. 91 మీటర్లుగా ఉన్న గత ఒలింపిక్స్ రికార్డును అతడు బద్దలు కొట్టాడు. జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ, రజతాలు గెలిచిన వీరిద్దరూ రాబోయే సంవత్సరాల్లో నువ్వా నేనా అన్నట్టుగా తలపడడం ఖాయంగా కనిపిస్తోంది.
దాదాపు ఒకే సమయంలో కెరీర్ ఆరంభించి ఒలింపిక్స్ పతకాలు కొల్లగొట్టిన వీరిద్దరికీ ప్రభుత్వాలతో పాటు పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించాయి. దీంతో వీరిద్దరి నికర ఆస్తుల విలువ ఎంతనే పోలిక మొదలైంది. 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్, టోక్యో 2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా నికర ఆస్తి విలువ సుమారు 4.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.37 కోట్లు) ఉంటుందని జీక్యూ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. నీరజ్ చోప్రా ఒమేగా, అండర్ ఆర్మర్‌తో పాటు పలు టాప్ బ్రాండ్‌లకు ప్రచారం చేస్తున్నాడని పేర్కొంది.
నదీమ్ ఆస్తి ఎంతంటే..
నీరజ్ చోప్రా ఆస్తి విలువతో పోల్చితే నదీమ్ నికర ఆస్తి విలువ చాలా తక్కువని తెలుస్తోంది. ఒలింపిక్స్‌కు ముందు అతడి నికర ఆస్తి విలువ భారతీయ కరెన్సీలో రూ.1 కోటి కంటే తక్కువగా ఉంటుందని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే స్వర్ణ పతకం సాధించడంతో అతడి ఆస్తి విలువ పెరగడం ఖాయమని పేర్కొన్నాయి. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నదీమ్‌కు ప్రభుత్వంతో పాటు కార్పొరేటు సంస్థలు సుమారు 153 మిలియన్ పాకిస్థానీ రూపాయలను నగదు బహుమతి ప్రకటించాయి. అయితే భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ.4.6 కోట్లుగా ఉంటుందని అంచనాగా ఉంది.