Chandrababu: దేశంలో టాప్ 5 రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త పారిశ్రామికాభివృద్ధి విధానం: సీఎం చంద్రబాబు

CM Chandrababus new industrial development policy in AP to compete with the top 5 states in the country

  • పాలసీ రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన సీఎం చంద్రబాబు
  • పరిశ్రమల స్థాపనలో ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను తిరిగి తీసుకురావాలని తెలిపిన చంద్రబాబు
  • ఈనెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల అభివృద్ధిలో దేశంలోని టాప్-5 రాష్ట్రాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో, కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. 15 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం ఉండాలన్నారు.

సోమవారం రాష్ట్ర సచివాలయంలో, పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్, అధికారులతో కలిసి 2024-29 కాలానికి సంబంధించి కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం ముసాయిదా పై చంద్రబాబు నాయుడుకు వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, 2014-19 కాలంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధిలో పొందిన బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి పొందేందుకు కృషి చేయాలని, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని, పరిశ్రమలకు సత్వర అనుమతులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యాలు, లాజిస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో, పరిశ్రమలు ఏర్పాటుకు ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని ఆయన వివరించారు. తూర్పు తీర ప్రాంతం పశ్చిమ తీరంతో పోలిస్తే మెరుగైన రీతిలో రోడ్డు, రైలు, విమాన మార్గాలతో అనుసంధానం కలిగి ఉందనీ, నదుల అనుసంధానం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈ నెల 16న పారిశ్రామిక వేత్తలతో సమావేశం జరుపుతామని, ఈ నెల 23న మరోసారి నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై చర్చించనున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మొదట, రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, 2024-29 పారిశ్రామికాభివృద్ధి విధానం ముసాయిదాలో పొందుపర్చిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

  • Loading...

More Telugu News