Drugs Case: డ్రగ్స్ కేసులో రెండు నెలలుగా పరారీలో ఉన్న మస్తాన్‌రావు అరెస్ట్

Drugs Case Raavi Sai Masthan Who Absconded For Two Months Arrested In Guntur
  • గుంటూరులో అరెస్ట్ చేసిన విజయవాడ సెబ్ పోలీసులు
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • రాజ్‌తరుణ్-లావణ్య కేసులో తెరపైకి మస్తాన్‌రావు
  • డ్రగ్స్ కేసులో ఏ5 ముద్దాయిగా మస్తాన్‌రావు
  • లావణ్యను బంధించిన కేసులో ఏ4గా నిందితుడు
డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న గుంటూరుకు చెందిన రావి సాయి మస్తాన్‌రావును విజయవాడ సెబ్ పోలీసులు నిన్న గుంటూరులో అరెస్ట్ చేశారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసు సందర్భంగా మస్తాన్‌రావు పేరు తెరపైకి వచ్చింది. రెండు నెలల క్రితం గుంటూరుకు చెందిన యనమల గోపీచంద్ ఢిల్లీ నుంచి 35 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను కొనుగోలు చేసి రైలులో వస్తుండగా విజయవాడలో అరెస్ట్ చేశారు. అతడి కోసం బయట కారులో ఎదురుచూస్తున్న గుంటూరుకు చెందిన ఎడ్ల కాంతికిరణ్, షేక్ ఖాజా మొహిద్దీన్, షేక్ నాగూర్ షరీఫ్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా మస్తాన్‌రావు పేరు బయటకు వచ్చింది.  అతడు అడ్రస్ ఇవ్వడంతోనే ఢిల్లీ వెళ్లి డ్రగ్స్ తెచ్చినట్టు చెప్పాడు. దీంతో ఈ కేసులో మస్తాన్‌ను ఏ5గా చేర్చారు.

అప్పటి నుంచి పరారీలో ఉన్న మస్తాన్ నిన్న ఉదయం గుంటూరు జీటీ రోడ్డులోని మస్తాన్‌దర్గా వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా, నటుడు రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్యను గదిలో పెట్టి వేధించిన కేసులో మస్తాన్‌రావు ఏ4గా ఉన్నాడు. ఇదే కేసులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్‌రెడ్డి, అనురాధ, మరొకరు అరెస్ట్ అయ్యారు. అనురాధకు గోవాలోని నైజీరియన్లతో సంబంధాలు ఉన్నాయని తేలింది. వారి సాయంతోనే డ్రగ్స్ తెస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మి అరెస్ట్‌తో మస్తాన్ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. కాగా, బీటెక్ చేసిన మస్తాన్, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
Drugs Case
Guntur District
Vijayawada
Raj Tarun
Lavanya
Raavi Sai Masthan

More Telugu News