Donald Trump: డిబేట్ లో బైడెన్ ను చిత్తుగా ఓడించా.. : ట్రంప్
- అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ను తప్పించడం ఓ కుట్ర అన్న ట్రంప్
- హత్యాయత్నం తర్వాత దేవుడిపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్య
- ఎలాన్ మస్క్ తో ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన మాజీ అధ్యక్షుడు
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ ను తప్పించడం ఓ కుట్ర అని రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చివరి వరకూ తానే పోటీలో ఉంటానన్న వ్యక్తి సడెన్ గా వైదొలగడం కుట్ర కాకుండా ఏంటని ప్రశ్నించారు. బైడెన్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేశారని, ఆయనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
ఎన్నికల ప్రచారం సందర్భంగా బైడెన్ తో జరిగిన డిబేట్ తన గొప్ప చర్చల్లో ఒకటని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ డిబేట్ లో బైడెన్ ను చిత్తుగా ఓడించానని, దాని ప్రభావంతో డెమోక్రాట్లు కుట్ర చేసి ఆయనను పోటీ నుంచి తప్పించారని ఆరోపించారు. ఈమేరకు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తో జరిగిన తాజా ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) లో జరిగిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
క్షణంలోనే తేరుకున్నా..
పెన్సిల్వేనియా ప్రచార సభలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. హత్యాయత్నం నుంచి బయటపడ్డ తర్వాత దేవుడిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. కాల్పులు జరిగినపుడు తల తిప్పడమే తనను కాపాడిందని, బుల్లెట్ గాయం తర్వాత వెంటనే తనపై కాల్పులు జరిపారనే విషయం అర్థం చేసుకున్నానని వివరించారు. ఆ క్షణమే తేరుకున్నానని, మళ్లీ ప్రసంగం కొనసాగించాలని భావించగా సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పారని తెలిపారు.
అమెరికాలోకి నేరస్థులను పంపిస్తున్నాయి..
అమెరికా సరిహద్దు వివాదాలు, వలసదారులకు అడ్డుకట్ట వేయడంపై ట్రంప్ స్పందిస్తూ.. బార్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశాలు తమ దేశంలోని నేరస్థులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని అమెరికాకు పంపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలోకి అక్రమ వలసలను కఠినంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ కూడా అంగీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు అసలు ఐక్యూయే లేదని ట్రంప్ విమర్శించారు. బైడెన్ కు ఐక్యూ చాలా తక్కువని గతంలో తాను చెప్పానన్న ట్రంప్.. ఆయన పాలన చూశాక అసలు బైడెన్ ఐక్యూ జీరో అని అర్థం చేసుకున్నానని వివరించారు.
ఎక్స్ లోకి ట్రంప్ రీఎంట్రీ..
మస్క్ తో ఇంటర్వ్యూ జరుగుతుండగా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో తన ట్విట్టర్ ఖాతాను నిషేధించడంతో ట్రంప్ సొంతంగా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకున్నారు. ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్రంప్ పై నిషేధం ఎత్తివేశారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పలు ట్వీట్లు చేశారు.