Muhammad Yunus: 'మాన్‌స్టర్‌ వెళ్లిపోయింది'.. మాజీ ప్ర‌ధానిపై ముహమ్మద్ యూనస్ ఘాటు విమ‌ర్శ‌!

Muhammad Yunus declares monster is gone referring to Ex PM Sheikh Hasina
  • ఇటీవ‌లే బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మహమ్మద్‌ యూనస్ ప్ర‌మాణం
  • తాజాగా విద్యార్థులతో సమావేశమైన యూన‌స్‌
  • ఆందోళనలను ముందుండి నడిపించిన విద్యార్థి నాయకులపై ప్రశంస‌
  • అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ షేక్ హ‌సీనాపై ఘాటు వ్యాఖ్య‌ 
బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఎన్నికైన నోబెల్ అవార్డు గ్ర‌హీత‌ ముహమ్మద్‌ యూనస్ గ‌త గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆదివారం రాత్రి ఆయన విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆందోళనలను ముందుండి నడిపించిన విద్యార్థి సంఘాల నాయకులను ఆయ‌న ప్రశంసించారు. 

అనంత‌రం మీడియాతో మాట్లాడిన యూన‌స్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను ఉద్దేశించి 'మాన్‌స్టర్‌ వెళ్లిపోయింది' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల వరుస నిరసనల తర్వాత దేశం నుంచి పారిపోయిన మాజీ ప్రధాని హసీనాను ఉద్దేశించి ‘చివరిగా ఈ క్షణం వ‌చ్చింది. రాక్షసి వెళ్లిపోయింది’ అని అన్నారు. 

"విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లపం మొత్తం ప్రభుత్వాన్నే కూల్చేసింది. నిరంకుశ పాలనకు ముగింపు పలికింది. దేశం నుంచి మాన్‌స్టర్‌ (రాక్షసి) వెళ్లిపోయింది. మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు తాత్కాలిక పరిపాలన బాధ్యతలు తీసుకొమ్మని కోరినందు వల్లే అంగీకరించాను’’ అని ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు.

అలాగే ఇప్పటికే విద్యార్థి సంఘం నాయకులు నహిద్‌ ఇస్లాం, ఆసిఫ్‌ మహ్మద్‌లను 16 మంది సభ్యుల సలహా మండలిలో చేర్చుకున్నామని ఆయన అన్నారు.

ఇక 2006లో మైక్రోఫైనాన్స్‌లో చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు 84 ఏళ్ల యూన‌స్‌. కమ్యూనిటీ అభివృద్ధి కోసం గ్రామీణ్ బ్యాంక్‌ను కూడా స్థాపించారు. 

కాగా, ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో రిజ‌ర్వేష‌న్ కోటాపై నిరసనల కారణంగా బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దాంతో ఐదుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్‌ హసీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి, దేశం నుంచి వెళ్లిపోవ‌డానికి దారితీసింది. ఆ త‌ర్వాత‌ ముహమ్మద్‌ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విష‌యం తెలిసిందే.
Muhammad Yunus
Sheikh Hasina
Bangladesh

More Telugu News