DDOS Attack: ట్రంప్ ఇంటర్వ్యూపై డీడీఓఎస్ అటాక్.. ఏంటీ దాడి?
- 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్వ్యూ
- వీక్షకులను అడ్డుకోవడమే ఈ అటాక్ లక్ష్యం
- తొలుత సాంకేతిక సమస్యగా భావించిన ఎక్స్ సిబ్బంది
డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ అరుదైన ఇంటర్వ్యూకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తొలుత దాదాపుగా 80 లక్షల మంది ఇంటర్వ్యూను విన్నారు. తర్వాత ఈ సంఖ్య 2.7 కోట్ల మందికి చేరింది. అయితే, ఇంటర్వ్యూ ప్రారంభమయ్యే సమయానికి సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇంటర్వ్యూ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఆడియో సరిగా వినిపించలేదని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. తొలుత సాంకేతిక సమస్యగా భావించినప్పటికీ తర్వాత డీడీఓఎస్ అటాక్ జరిగిందని మస్క్ తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూపై ట్రంప్ స్పందిస్తూ.. అన్ని రికార్డులు బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది శతాబ్దపు ఇంటర్వ్యూ అని వ్యాఖ్యానించారు.
ఏంటీ డీడీఎస్ అటాక్..?
డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్) అటాక్ లక్ష్యం ఓ వెబ్ సైట్ లేదా సర్వర్ కు తాత్కాలికంగా వీక్షకులను దూరం చేయడం. టార్గెట్ చేసిన సర్వర్ కు డీడీఓఎస్ నుంచి ట్రాఫిక్ పోటెత్తుతుంది. దాంతో వెబ్ సైట్ పనితీరు మందగిస్తుంది. కొన్ని సందర్బాలలో వెబ్ సైట్ ఆఫ్ లైన్ లోకి మారుతుంది. దీంతో నిజమైన వ్యూయర్లు లాగిన్ కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అటాక్ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు కూడా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్, మస్క్ ఇంటర్వ్యూను ఎక్కువ మంది యూజర్లు వినకుండా అడ్డుకోవడానికి ఈ దాడి జరిగిందని తెలిపారు.