Jogi Ramesh: చంద్రబాబు ఇంటిపై దాడి కేసు... జోగి రమేశ్‌కు నోటీసులిచ్చిన పోలీసులు
- మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలన్న పోలీసులు
- కొడుకు రాజీవ్ అరెస్ట్‌పై స్పందించిన జోగి రమేశ్
- కక్ష సాధింపు రాజకీయాలు సరికాదని వ్యాఖ్య
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని తెలిపారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో ఉదయం జోగి రమేశ్ తనయుడు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు, జోగి రమేశ్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి.
వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేశ్ దాడికి ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.
కొడుకు అరెస్ట్‌పై స్పందించిన జోగి రమేశ్
తన కొడుకును అరెస్ట్ చేయడం సరికాదని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, అంతేకానీ అమెరికాలో చదువుకొని వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న తన కొడుకుపై కక్ష తీర్చుకోకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి... పోతుంటాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈరోజు టీడీపీ అధికారంలో ఉండవచ్చు... కానీ కక్షసాధింపు చర్యలు మాత్రం సరికాదన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయ కక్షలకు దూరంగా ఉంటే మంచిదన్నారు.