Nadendla Manohar: కాకినాడ పోర్టు ఏ ఒక్క కుటుంబానిదీ కాదు: మంత్రి నాదెండ్ల మనోహర్

Nadendla Manohar inspects check post at Kakinada anchorage port
  • కాకినాడ యాంకరేజి పోర్టు వద్ద చెక్ పోస్టును తనిఖీ చేసిన నాదెండ్ల
  • రేషన్ మాఫియా అక్రమాలపై సీఎంతో చర్చిస్తామని వెల్లడి
  • సీఐడీతో గానీ, ఇతర సంస్థలతో గానీ విచారణ జరిపిస్తామని స్పష్టీకరణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నాదెండ్ల మనోహర్ తాజాగా కాకినాడ యాంకరేజి పోర్టు వద్ద చెక్ పోస్టును తనిఖీ చేశారు. 

ముఖ్యమంత్రితో చర్చించి రేషన్ మాఫియా అక్రమాలపై విచారిస్తామని చెప్పారు. సీఐడీ గానీ, మరే ఇతర సంస్థతో గానీ విచారణ చేయిస్తామని తెలిపారు. తనిఖీలు చేపడితే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతామని కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తామంటే ఎవరూ అడ్డుకోరని, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాదెండ్ల పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని స్పష్టం చేశారు. 

చెక్ పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్ఘాటించారు. కాకినాడ పోర్టు ఏ ఒక్క కుటుంబానిదీ కాదని, పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 

యాంకరేజి పోర్టు వద్ద లారీలు ఎక్కువ సేపు ఆగకుండా మరో చెక్ పోస్టు ఏర్పాటు చేస్తామని, చెక్ పోస్టుల్లో మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు ఉంటారని వివరించారు. తనిఖీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు.
Nadendla Manohar
Minister
Kakinada Port
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News