Vulture: ఝార్ఖండ్‌లో మత్స్యకారులకు దొరికిన రాబందు.. దాని కాలికి ఢాకా అడ్రస్‌తో ఉంగరం
- హజారీబాగ్ జిల్లా కోనార్ డ్యాం జలాల్లో గాయపడిన స్థితిలో రాబందు
- గుర్తించి రక్షించిన మత్స్యకారులు
- దాని కాలికి ఢాకా అడ్రస్‌తో ఉంగరం, ట్రాకింగ్ డివైజ్
- బంగ్లాదేశ్ అల్లర్లకు, దీనికి ఎలాంటి సంబంధం లేదన్న అధికారులు
అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరిన రాబందు ఒకటి ఝార్ఖండ్‌లోని మత్స్యకారులకు చిక్కింది. రాష్ట్రంలోని హజారీబాగ్ జిల్లాలోని కోనార్ డ్యాం జలాల్లో గాయపడిన స్థితిలో ఇది కనిపించడంతో, మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ఆపై అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. వెనకభాగంలో తెల్లగా ఉన్న ఈ రాబందు అంతరించిపోతున్న జాతుల్లో షెడ్యూల్-1 కేటగిరీలో ఉంది.
ఈ రాబందుపై ‘జీపీవో బాక్స్-2624, ఢాకా, బీ 67’ అని రాసి ఉన్న ట్రాకింగ్ డివైజ్‌ను గుర్తించారు. ఎవరైనా దీనిని గుర్తిస్తే ‘[email protected]’లో సంప్రదించాలని ఓ నోట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ రాబందుకు చికిత్స అందిస్తున్నట్టు అటవీ అధికారులు తెలిపారు.
బ్రిటన్‌కు చెందిన రాయల్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ అనే సంస్థ ఈ రాబందు కదలికలను తెలుసుకునేందుకు దానిపై రేడియో కాలర్, ట్రాకర్ ను అమర్చి విడిచిపెట్టనట్టు భావిస్తున్నారు. అంతేతప్ప దీనికి బంగ్లాదేశ్ అల్లర్లతో ఎలాంటి సంబంధమూ లేదని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.