Nallri Kiran Kumar Reddy: నేను సీఎంను అయి ఉంటే జిల్లాలను కలిపేసి ఉండేవాడిని.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- జిల్లాలను విభజించి గత ప్రభుత్వం తప్పు చేసిందన్న మాజీ ముఖ్యమంత్రి
- చంద్రబాబు సీఎం కావడంతో సంతోషంగా ఉందన్న కిరణ్‌కుమార్‌రెడ్డి
- రాజధాని, పోలవరం ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచన
- కేంద్రం సాయంతో సమస్యలు పరిష్కరించుకోవాలన్న బీజేపీ నేత
గత ప్రభుత్వం జిల్లాలను విభజించి తప్పు చేసిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తాను కనుక సీఎంగా ఉండి ఉంటే విడగొట్టిన జిల్లాలను మళ్లీ కలిపేసి ఉండేవాడినని చెప్పారు. సమర్థుడైన చంద్రబాబునాయుడు ఏపీకి మళ్లీ సీఎం కావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో వాటిని పరిష్కరించాలని సూచించారు.
రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఘటనలు వాటి పర్యవసానమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్‌ను తప్పిస్తేనే తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్య పరిష్కారం అవుతుందని కిరణ్‌కుమార్ చెప్పారు. ఈ ట్రైబ్యునల్‌పై తీర్పుపై తాను స్టే తీసుకొచ్చి 11 ఏళ్లు అవుతోందని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో అప్రమత్తం కాకుంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.